వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు

వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో బైఠాయించి నిరసన 

చందుర్తి, వెలుగు: వడ్లు కొనాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి రైతులు రోడ్డెక్కారు.  వేములవాడ- – కోరుట్ల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు వెళ్లి  రైతులను ధర్నా విరమించాలని  కోరినా వినిపించుకోలేదు. వడ్లను ఆరబెట్టి తేమ శాతానికి వచ్చి 20 రోజులైనా కాంటాలు వేయడంలో ఐకేపీ సిబ్బంది జాప్యం చేస్తున్నారంటూ  మండిపడ్డారు.  దీంతో రైతులను పోలీసులు రోడ్డుపై నుంచి బలవంతంగా లాగేశారు. అనంతరం వడ్ల కోసం కల్లాలు ఏర్పాటుకు 176 సర్వే నంబర్ లో జాగా కేటాయించాలని తహసీల్దార్ కు రైతులు వినతిపత్రం అందించారు. సిరికొండ శ్రీనివాస్, సిర్రం తిరుపతి, మర్రి రాజు, మింగని రవి, షిరిడి మల్లేశం, మర్రి మల్లేశం రైతులు పాల్గొన్నారు.

సిరిసిల్ల టౌన్ : వడ్లను వెంటనే కొనాలని వీర్నపల్లి మండలం వన్ పల్లి రైతులు డిమాండ్ చేస్తూ సిరిసిల్ల– కరీంనగర్ రహదారిపై బైఠాయించారు. వడ్లను తెచ్చి నెల గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. వెంటనే  కొనుగోలు ప్రారంభించాలని  కోరారు. లేదంటే ఆందోళనలు చేస్తామన్నారు. అనంతరం పోలీసులు నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమింపజేశారు.