అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు .. తండ్రీకొడుకులు మృతి

అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు ..  తండ్రీకొడుకులు మృతి

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మేడిపల్లి శివారులో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెట్ పల్లికి చెందిన తండ్రీకొడుకులు చనిపోయారు. మేడిపల్లి పోలీసుల కథనం ప్రకారం..పట్టణంలోని ఎస్సారెస్పీ క్యాంప్ కు చెందిన మొహమ్మద్ ఖైరొద్దీన్ (80) రిటైర్డ్ ఉద్యోగి. ఇతడికి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు రషీదొద్దీన్ (60) మెట్ పల్లి మండలం విట్టంపేట్ గవర్నమెంట్ స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్. రషీదొద్దీన్ భార్య, పిల్లలు కరీంనగర్ లో ఉంటున్నారు. ఈయన సోమవారం నుంచి శనివారం వరకు తండ్రి ఇంట్లో ఉండి స్కూల్​కు వెళ్లి వస్తుంటాడు. 

ప్రతి శనివారం రాత్రి కరీంనగర్ వెళ్తాడు. రషీదోద్దీన్ కు కొడుకు, కూతురు ఉండగా, జూన్​లో  బిడ్డ పెండ్లి చేయాలని నిర్ణ యించారు. ఈ క్రమంలో మంగళవారం రషీదొద్దీన్ తన తండ్రి ఖైరొద్దీన్ ను హాస్పిటల్​లో  చూపించేందుకు కారులో కరీంనగర్ తీసుకువెళ్లాడు. చెకప్ అయిపోయాక ఇంటికి వెళ్లి బుధవారం మధ్యాహ్నం మెట్ పల్లికి బయలుదేరారు. మేడిపల్లి మండలం శివారులోని రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు కాగా, తండ్రీకొడుకులు తీవ్రంగా  గాయపడ్డారు. ఇది చూసిన కొందరు ప్రయాణికులు జగిత్యాల హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. రషీదొద్దీన్ భార్య పర్వేజ్ నస్రీన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.