- మార్కెట్ డైరెక్షన్ నిర్ణయించనున్న ఫెడ్, బీఓఈ, బీఓజే పాలసీ మీటింగ్స్
- అప్ ట్రెండ్‌లో మార్కెట్..
- నికర కోనుగోలుదారులుగా మారిన ఎఫ్‌ఐఐలు
- రానున్న సెషన్లలో 25 వేలకు నిఫ్టీ!
ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా నాల్గో వారాన్ని కూడా లాభాల్లో ముగించాయి. శుక్రవారం సెషన్‌లో ఇంట్రాడే నష్టాల నుంచి కోలుకొని సుమారు ఒక శాతం లాభపడ్డాయి. క్వాలిటీ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు పెరగడంతో పాటు, విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా మారడం కలిసొస్తోంది. రానున్న వారంలో కూడా పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 17–18 న ఫెడ్ పాలసీ మీటింగ్ జరగనుంది. దీని ఎఫెక్ట్ మార్కెట్‌పై 19 న కనిపిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బీఓఈ), బ్యాంక్ ఆఫ్ జపాన్ (బీఓజే) మానిటరీ పాలసీ మీటింగ్స్ ఈ నెల 19 న జరగనున్నాయి. ఇండియా మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్ పీఎంఐ డేటా, యూఎస్ జీడీపీ డేటా కూడా ఈ వారం విడుదల కానున్నాయి. మార్కెట్ డైరెక్షన్‌ను ఇవి నిర్ణయించనున్నాయి. ‘రానున్న సెషన్లలో మార్కెట్ కన్సాలిడేటెడ్ అవుతుందని, మెల్లగా పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. నిర్దిష్టమైన షేర్లలో కొనుగోళ్లు పెరుగుతాయి’ అని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్ధార్ధ ఖేమ్కా పేర్కొన్నారు. తక్కువ రేటుకే దొరికే క్వాలిటీ షేర్లలో కొనుగోళ్లు పెరుగుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఈ ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేశారు.
మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు..
ఫెడ్ ..25 బేసిస్ పాయింట్ల కోత
ఈ వారం గ్లోబల్ మార్కెట్‌ల ఫోకస్ ఫెడ్ మీటింగ్‌పై ఉంటుంది. ఈ నెల 19 న పాలసీ వివరాలు వెలువడతాయి. ఈసారి మీటింగ్‌లో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇంకో నెలలో ఏర్పాటయ్యే ట్రంప్ ప్రభుత్వంలో ఇన్‌ప్లేషన్ పెరిగే ఛాన్స్ ఉందని ఆందోళన చెందుతున్నారు. చైనా, కెనడా, ఇండియా వంటి దేశాల నుంచి జరుగుతున్న దిగుమతులపై సుంకాలు పెంచుతామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది యూఎస్ వడ్డీ రేట్లు పెద్దగా తగ్గకపోవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. అలానే ఈ నెల 19 న వెలువడే యూఎస్ జీడీపీ నెంబర్లపై కూడా ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టాలి. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో యూఎస్ జీడీపీ 2.8 శాతం పెరుగుతుందని అంచనా.
ఫెడ్‌ను ఫాలో కానున్న బీఓఈ, బీఓజే
బీఓఈ, బీఓజే తమ పాలసీ వివరాలను ఈ నెల 19న విడుదల చేయనున్నాయి. ఈ రెండు సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గిస్తాయని అంచనా. ప్రభుత్వ ఖర్చులు పెరగడంతో ఇంగ్లండ్‌లో ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుందని బీఓఈ ఆందోళన చెందుతోంది.
.
24,700 పైన కొనసాగాలి..
నిఫ్టీ 24,700 పైన కొనసాగితే రానున్న సెషన్లలో 24,860 లెవెల్‌కు చేరుకుంటుందని, అక్కడి నుంచి 25 వేల లెవెల్‌ను కూడా టచ్ చేయొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. 25 వేల లెవెల్‌ను దాటలేకపోతే తిరిగి 24,500, 24,350 లెవెల్‌కు పడొచ్చని పేర్కొన్నారు.
ఎకనామిక్ డేటా..
డిసెంబర్ నెలకు సంబంధించి యూఎస్, యూరప్, జపాన్ దేశాల మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్ పీఎంఐ డేటా ఈ వారంలో వెలువడనున్నాయి. వీటితో పాటు యూఎస్ రిటైల్ సేల్స్ డేటా, వీక్లీ జాబ్స్ డేటా, సెప్టెంబర్ క్వార్టర్‌కు సంబంధించి రియల్ కన్జూమర్ స్పెండింగ్ డేటా వెలువడనున్నాయి. నవంబర్ నెలకు సంబంధించి యూరప్, యూకే, జపాన్ దేశాల ఇన్‌ఫ్లేషన్ నెంబర్లు ఈ వారం వెలువడనున్నాయి. ఇండియాలో హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ డేటా, మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్ పీఎంఐ డేటా ఈ నెల 16 న బటయకొస్తాయి.