ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెల్లూరులోని రొట్టెల పండుగ మొదలైంది. ప్రతిష్టాత్మకంగా జరిగే బారాషహీద్ రొట్టెల పండుగ వైభవంగా ప్రారంభమైంది. ఈ దర్గాకు దేశ, విదేశాల్లో ఎంతో ప్రాశస్త్యం పొందిన నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగ జులై 29 నుంచి ఆగస్టు 2 వరకు జరగనుంది. ఈ మేరకు జిల్లా వక్ఫ్‌బోర్డు, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలకు లక్షల్లో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
బారాషహీద్ దర్గా రొట్టెల పండగ వివరాలు
- జులై 29న షాహాదత్ రోజున సందన్ మాలి (సమాధులు శుభ్రం)
- జులై 30న రాత్రి గంధోత్సవం
- జులై 31న రొట్టెల పండుగ
- ఆగస్టు1న తహలీల్ ఫాతెహా
- ఆగస్టు2న ఉత్సవం ఉంటుందని రొట్టెల పండగ కమిటీ తెలిపింది.
ఈ దర్గాకు చారిత్రక నేపథ్యం ఉన్న విశేషమైన ఆరోగ్య చరిత్ర కూడా ఉంది. ఈ మట్టి పవిత్రం, ఈ నీరు పవిత్రం అని చెబుతారు. ఇక్కడ 12 మంది యుద్ధ వీరుల మరణానికి చిహ్నంగా దర్గా ఏర్పాటు చేశారు. అయితే.. ఇప్పటికా 12 సమాధులు ఇక్కడ ఉండడమేకాదు..ఈ సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. బాహాషహీద్ దర్గా గంధ మహోత్సవం రోజున, దర్గా సమీపంలోని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆరోగ్య రొట్టె, ఐశ్వర్య రొట్టె, విదేశీ విద్యా రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె.. ఇలా వివిధ రకాల పేర్లతో వీటిని పిలుస్తారు.
ఒక ఏడాది రొట్టె తీసుకుని తమ కోర్కె నెరవేరితే, మరుసటి ఏడాది అదే పేరుతో రొట్టెను చేసుకుని తీసుకొచ్చి అక్కడ ఆయా ప్రతిఫలం కోసం ఎదురు చూస్తున్నవారికి ఇస్తుంటారు. ఇక్కడ ఆరోగ్య రొట్టెకు ఎక్కువ డిమాండ్ .. ఇక్కడి రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి పండుగలో పాల్గొంటారు. పండుగ కోసం బారాషాహీద్ దర్గా, స్వర్ణాల చెరువును అందంగా ముస్తాబు చేశారు. రొట్టెల పండుగ రోజున స్వర్ణాల చెరువులో ఒకరికొకరు రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. మనసులో కోరుకుని రొట్టెను పుచ్చుకుంటే అవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం.