భువనగిరి ‘త్రీజీ’ రిలీజ్

భువనగిరి ‘త్రీజీ’ రిలీజ్
  • ఈనెల 25 నుంచి రైతులతో మీటింగ్​
  • ప్రతి రైతు నుంచి ల్యాండ్​ డిటైల్స్ సేకరణ
  • వలిగొండలో మీటింగ్​బహిష్కరించిన రైతులు
  •  దివీస్ కంపెనీ కోసమే అలైన్​మెంట్ మార్చారని ఆరోపణ
  • బహిరంగ మార్కెట్​ రేటు ప్రకారమైతే ఇస్తామంటున్న రైతులు

యాదాద్రి, వెలుగు : రీజినల్​రింగ్ రోడ్డు ఉత్తర భాగంలోని చివరి త్రీజీ నోటిఫికేషన్​రిలీజ్ అయింది. భూ సేకరణ కోసం ఉత్తర భాగంలో ఏర్పాటు చేసిన 8 'కాలా'ల్లో ఏడింటి త్రీజీ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. తాజాగా భువనగిరికి చెందిన త్రీజీని నేషనల్​హైవే అథారిటీ రిలీజ్ చేసింది. సంగారెడ్డి, మెదక్​, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణం కానుంది. 164 కిలోమీటర్ల రోడ్డుకు అవసరమైన 5,025  ఎకరాలను సేకరించడానికి ఆయా జిల్లాల్లో 8 'కాలా' (కాంపిటెంట్​ అథారిటీ ఫర్​ ల్యాండ్​ అక్విజేషన్​)లను ఏర్పాటు చేసి అడిషనల్​కలెక్టర్, ఆర్డీవోలను బాధ్యులుగా నియమించారు. 

వీటిల్లో ఇప్పటికే ఏడు 'కాలా'లకు సంబంధించిన త్రీజీ రిలీజ్​అయింది. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి రైతులు హైకోర్టును ఆశ్రయించడం వల్ల త్రీజీ రిలీజ్​చేయలేదు. తాజాగా ఈ నెలలోనే హైకోర్టు కేసును కొట్టివేయడంతో నేషనల్​హైవే అథారిటీ తాజాగా భువనగిరి త్రీజీని రిలీజ్​చేసింది. భువనగిరి పరిధిలోని గౌస్​ నగర్, కేసారం, ఎర్రంబెల్లి, తుక్కాపూర్, పెంచికల్ పహాడ్, రాయగిరిలో 15 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. ఇందుకోసం 328 సర్వే నంబర్లలోని 170.53 ఎకరాలను సేకరించాల్సి ఉంది. వీటికి సంబంధించిన వివరాలను 'భూమి రాశి' పోర్టల్​లో వివరాలను నమోదు చేశారు. 

25 నుంచి మీటింగ్​లు.. డాక్యుమెంట్ సేకరణ..

త్రీజీ రిలీజ్​చేయడంతో ఆయా సర్వే నంబర్లలోని రైతులు, ఖాళీ ప్లాట్ల ఓనర్లతో ఈనెల 25 నుంచి 30 వరకు భువనగిరి ఆర్డీవో అమరేందర్​మీటింగ్​లు నిర్వహించాల్సి ఉంది. అగ్రికల్చర్​ల్యాండ్​లేదా ఖాళీ ప్లాట్ కోల్పోయే వాటి విస్తీర్ణం వివరాలను ఆఫీసర్లకు అందించాలి. అదేవిధంగా వాటిలోని ఇండ్లు, బాయి, బోరు, చెట్లు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది. అనంతరం వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, యజమాని ఆధార్, పాన్​కార్డు, బ్యాంక్​పాస్​బుక్​జిరాక్స్​కాపీలు అందించాల్సి ఉంటుంది. ఈనెల 25న గౌస్​నగర్, కేసారం, 26న ఎర్రంబెల్లి, 28న తుక్కాపూర్, 29న పెంచికల్ పహాడ్, 30న రాయగిరిలో మీటింగ్ నిర్వహించనున్నారు. 

'దివీస్​' కోసమే అలైన్​మెంట్​ మార్చినట్టుగా ఉంది..

'దివీస్' కంపెనీ కోసమే ట్రిపుల్ ఆర్ అలైన్​మెంట్​మార్చినట్టుగా ఉందని పలువురు రైతులు అన్నారు.  చౌటుప్పల్ పరిధిలోని వలిగొండ మండలానికి చెందిన రైతులతో ఆర్డీవో శేఖర్​రెడ్డి సోమవారం మీటింగ్ నిర్వహించారు. ట్రిపుల్​ఆర్ నిర్మాణానికి రైతులు సహకరించాలని, వాటికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఆర్డీవో కోరారు. ఇప్పటికే ల్యాండ్ రేట్లు పెంచామని, దాని ప్రకారం మీకు మూడు రెట్ల పరిహారం అందుతుందని తెలిపారు.

దీంతో పలువురు రైతులు మాట్లాడుతూ రూల్స్​ప్రకారం ఔటర్​రింగ్​రోడ్డు నుంచి 40 కిలోమీటర్ల తర్వాత ట్రిపుల్​ఆర్​ఏర్పాటు చేయాల్సిఉండగా, దివీస్​కంపెనీకు నష్టం జరగకుండా ఉండేందుకే 28 కిలోమీటర్లకు కుదించారని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ రేట్ల ప్రకారం తాము భూములు ఇవ్వమని వారు స్పష్టం చేశారు. బహిరంగ మార్కెట్​లో ఎకరానికి రూ.కోటి పలుకుతోందని, ఆ ప్రకారం 'అవార్డు' ప్రకటిస్తే భూములు ఇస్తామని తెలిపారు. లేకుంటే ఇవ్వమని తేల్చి చెప్పి, మీటింగ్​ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం మీటింగ్​హాలు బయట ఆందోళన నిర్వహించారు.