- వరల్డ్ ర్యాపిడ్, చెస్ చాంపియన్‌షిప్‌లో మాగ్నస్ కార్ల్‌సన్‌పై అనర్హత
న్యూయార్క్: వరల్డ్ చెస్‌లో దుమారం. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్, నార్వే చెస్ లెజెండ్ మాగ్నస్ కార్ల్‌సన్ ఫిడే డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు వరల్డ్ ర్యాపిడ్, బ్లిడ్జ్ చెస్ చాంపియన్‌షిప్ నుంచి అనర్హతకు గురయ్యాడు. డిఫెండింగ్ చాంపియన్ అయిన మాగ్నస్ రెండో రోజు, శుక్రవారం రాత్రి ర్యాపిడ్ పోటీలకు జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చాడు. టోర్నీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు ట్రోజర్స్ ( సాధారణ ప్యాంట్లు) మాత్రమే ధరించాలి. ఈ నేపథ్యంలో కార్ల్‌సన్‌కు టోర్నీ చీఫ్ ఆర్బిటర్ అలెక్స్ హొలోజాక్ 200 డాలర్ల జరిమానా విధించాడు.
ఎనిమిదో రౌండ్ గేమ్ తర్వాత జీన్స్ కాకుండా ట్రోజర్స్ వేసుకొని రావాలని ఆదేశించగా.. మాగ్నస్ ఒప్పుకోలేదు. తర్వాతి రోజు పోటీకి ట్రోజర్స్‌తో వస్తానని.. వెంటనే జీన్స్ మార్చుకోనని స్పష్టం చేశాడు. దాంతో అతడిని ర్యాపిడ్ పోటీల నుంచి తప్పిస్తున్నట్టు ఆర్బిటర్ ప్రకటించాడు. దీనికి నొచ్చుకున్న కార్ల్‌సన్ బ్లిట్జ్ విభాగం నుంచి కూడా విత్‌డ్రా అవుతున్నట్టు ప్రకటించాడు.
ఫిడె డ్రెస్ కోడ్ నిబంధనలతో తాను విసిగిపోయానని, ఇవన్నీ మూర్ఖపు రూల్స్ అని విమర్శించాడు. మరోవైపు తమ చర్యను ఫిడే సమర్థించుకుంది. ప్రొఫెషనల్ ప్లేయర్లు, నిపుణులతో కూడిన ఫిడే అథ్లెట్స్ కమిషన్ సభ్యులు రూపొందించిన డ్రెస్ కోడ్‌ను అందరూ పాటించాల్సిందే అని స్పష్టం చేసింది. ఎన్నో ఏండ్లుగా అమలు చేస్తున్న ఈ రూల్స్ గురించి ప్లేయర్లందరికీ తెలుసని, టోర్నీకి ముందు కూడా వీటి గురించి ఆటగాళ్లకు తెలియజేశామని తెలిపింది.
టాప్ ప్లేస్‌లోకి అర్జున్
ర్యాపిడ్ విభాగంలో ఇండియా గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ నలుగురు ఆటగాళ్లతో కలిసి సంయుక్త ఆధిక్యంలోకి వచ్చాడు. రెండో రోజు జరిగిన 6–9 రౌండ్లలో అర్జున్ సత్తా చాటాడు. ఆరో గేమ్‌లో రాబ్సన్ (అమెరికా)పై గెలిచిన అతను ఏడో గేమ్‌లో ముర్జిన్‌తో డ్రా చేసుకున్నాడు. తర్వాతి గేమ్‌లో సర్గ్‌స్యాన్ (అర్మేనియా)ను ఓడించి.. తొమ్మిదో రౌండ్‌లో డుడా (పోలాండ్)తో పాయింట్ పంచుకున్నాడు.
13 రౌండ్ల టోర్నీలో ప్రస్తుతం అర్జున్ ఖాతాలో ఏడు పాయింట్లు ఉన్నాయి. మాగ్నస్ విత్‌డ్రా అవ్వడంతో అర్జున్‌కు విజయావకాశాలు పెరిగాయి. మరోవైపు ఇంకో మూడు రౌండ్లు మిగిలున్న విమెన్స్ సెక్షన్‌లో ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి చెరో 6.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.