
- కంపెనీ నిర్లక్ష్యంతో మంటలు, ఇబ్బందులు పడ్డ జనం
జీడిమెట్ల, వెలుగు: నివాస ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఓ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. జీడిమెట్ల సుభాష్‌నగర్‌లో శ్రీనివాస్అనే వ్యక్తి లిబ్రా అండ్లియో పాలిమార్స్ పేరుతో కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇందులో తయారైన ప్లాస్టిక్ట్రేలను నిర్లక్ష్యంగా ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద సంఖ్యలో నిల్వచేశాడు. మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు వీటికి మంటలు అంటుకొని దట్టమైన పొగలు వెలువడ్డాయి.
దీంతో చుట్టుపక్కల ఉన్న అపార్ట్‌మెంట్‌వాసులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటల వేడి, నల్లటిపొగలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కండ్ల మంటలు, శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు కాలిపోయాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. స్థానికులు సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, కంపెనీ నిర్లక్ష్యం వల్లనే అగ్నిప్రమాదం జరిగిందని జీడిమెట్ల ఫైర్ఆఫీసర్శేఖర్రెడ్డి తెలిపారు. కాగా, నివాస ప్రాంతాల్లో ఉన్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.