భూమిలేని కూలీలకు తొలివిడతగా రూ. 6 వేలు

భూమిలేని కూలీలకు తొలివిడతగా రూ. 6 వేలు
  • మార్గదర్శకాలు సిద్ధం చేయాలని కేబినెట్​ భేటీలో నిర్ణయం
  • రేషన్​ కార్డులు, రైతు భరోసా, విద్యుత్​ కమిషన్​ రిపోర్ట్​పైనా చర్చ
  • అప్పులపై ప్రతిపక్షం చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రెడీ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ కమిటీ హాల్​లో సోమవారం సాయంత్రం సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన కేబినెట్​ సమావేశమైంది. భూమిలేని నిరుపేద కూలీలకు రూ.6 వేలు మొదటి విడత కింద ఇచ్చే సాయంపై ఇందులో చర్చించారు. ఈ సాయంపై లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని కేబినెట్​లో నిర్ణయించినట్లు తెలిసింది. భూమి లేని నిరుపేద కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. తొలివిడతగా రూ. 6 వేలు ఈ నెల 28న పంపిణీ చేయనుంది. దీనిపై కేబినెట్​లో చర్చించారు. కొత్త రేషన్​ కార్డుల అంశంపైనా చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అనుసరిస్తున్న తీరుపైనా కేబినెట్​లో చర్చించారు.

సభకు విఘాతం కల్పించేలా వ్యవహరిస్తే.. అధికార పక్షం తరఫున గట్టిగా బదులివ్వాలని నిర్ణయించారు. అప్పులపైన బీఆర్​ఎస్​ సభ్యులు తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా..  డిప్యూటీ సీఎం భట్టికి ప్రివిలేజ్​ మోషన్​ ఇవ్వడంపై కేబినెట్​లో చర్చించినట్లు తెలిసింది. అప్పులపైనా, గత ప్రభుత్వ విధ్వంసంపైనా మరోసారి అసెంబ్లీ వేదికగా వెల్లడించాలనే అభిప్రాయానికి కేబినెట్​ వచ్చింది. రైతు భరోసాపై కేబినెట్​ సబ్​ కమిటీ ఇచ్చిన రిపోర్ట్​పైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమా చారం. ఇక దాదాపు 4 గంటలు సాగిన కేబినెట్​ భేటీలో ఫార్ములా ఈ రేస్​ అంశమే కాకుండా విద్యుత్​ కమిషన్​ రిపోర్ట్​పైనా కొంత చర్చించినట్లు తెలిసింది.