గాలం గండం.. డేంజర్​గా మారుతున్న కరెంట్​ షాక్​తో చేపల వేట​

గాలం గండం.. డేంజర్​గా మారుతున్న కరెంట్​ షాక్​తో చేపల వేట​
  • 10 రోజుల వ్యవధిలోనే ముగ్గురు మృతి
  • అవగాహన కల్పిస్తున్నామంటున్న విద్యుత్​ ఆఫీసర్లు
  • వాగుల్లో నీరు ఇంకిపోవడంతో జోరుగా ఫిష్షింగ్​

మహబూబాబాద్, వెలుగు: కరెంట్​తో ఫిష్షింగ్​ప్రాణాలకు ముప్పును తెస్తోంది. వేసవిలో మహబూబాబాద్​ జిల్లాలోని ఆకేరు, పాలేరు వాగుల్లో నీరు తగ్గుతుండడంతో గుంతల్లో ఉన్న చేపలను వేటాడుతున్నారు. ఈజీ ఫిష్షింగ్​ అంటూ జనం కరెంట్​ వైర్లతో చేపలు పడుతూ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఒక కర్రకు కరెంట్​ వైర్లు ఏర్పాటు చేసి షాక్​ఇవ్వడంతో చేపలు పైకి తేలితే పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదవశాత్తు కరెంట్​ వైర్లు కర్ర నుంచి జారితే షాక్​కు గురై అక్కడికక్కడే మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. గడిచిన పది రోజుల్లోనే కరెంట్​ షాక్​తో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు 
కోల్పోయారు. 

కరెంట్​తో చేపల వేటలో ప్రాణాలు గాల్లోకి..

అవగాహన లేకపోవడంతో ఈజీగా చేపలు పట్టాలని కరెంట్​తో ఏర్పాటు చేసే గాలంతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.​ ఫిబ్రవరి 12న నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన దండి ఉప్పలయ్య(45) చేపలు పట్టేందుకు వెళ్లి మృతి చెందాడు. మార్చి 4న మరిపెడ మండలం పురుషోత్తమాయిగూడెం స్టేజీ వద్ద నివాసం ఉండే జర్పుల శశి(20) చేపల వేటకు వెళ్లి తాను పట్టుకున్న కరెంట్​ వైర్లు తాకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ నెల 8న నెల్లికుదురు మండలం పెద్దతండాకు చెందిన బాదావత్ శేఖర్(21), భూక్య రాములు(45) విద్యుత్ వైర్లతో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఒకరిని కాపాడబోయి మరొకరు ప్రయత్నించి ఇద్దరూ చనిపోయారు. 

21న నరసింహులపేట మండలం  కొమ్ములవంచకు చెందిన పార్నంది మోహన్ (42) ఆకేరు వాగులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. కాగా, ఇలాంటి ఘటనలు నర్సింహులపేట, చిన్నగూడూరు, గూడూరు, నెల్లికుదురు, మరిపెడ, కురవి, దంతాలపల్లి, సీరోలు మండలాల్లో తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, ఏజెన్సీ మండలాలు గూడూరు, బయ్యారం, కొత్తగూడ, గంగారం మండలాల్లో పంట చేలను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ వైర్ల ఫెన్సింగ్ఏర్పాటు చేస్తున్నారు. జంతువులు సంచరించే ప్రాంతాల్లో వేటగాళ్లు విద్యుత్ వైర్లు అమర్చుతున్నారు. గతేడాది ఆ విద్యుత్ వైర్లకు తగిలి ఎనిమిది మంది మృతి చెందారు.

అవగాహన కల్పించినా..

కరెంట్​ ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్​ శాఖ ఆఫీసర్లు వ్యవసాయ సీజన్ ప్రారంభం జూన్ మొదటివారంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు, విద్యుత్ వినియోగదారుల సమావేశాలు, ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు, పొలం వద్దకే వెళ్లి రైతులతో మమేకమై విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా కొంతమంది పట్టించుకోవడం లేదు. 2023–24లో 37 మంది, 74 జంతులవులు, 2024–25లో ఇప్పటి వరకు 30 మంది, 81 జంతువులు విద్యుత్​ ప్రమాదాల కారణంగా మృత్యువాతపడ్డారు.

అవగాహన చర్యలు చేపడతాం.. 

జిల్లాలో చేపలు, అటవీ జంతువుల వేటకు విద్యుత్ వైర్లను వినియోగించి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు. గ్రామాల వారీగా విద్యుత్, పోలీస్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులతో సమన్వయ సమావేశాలను నిర్వహించి ప్రజలకు మరింతగా అవగాహన కల్పించడానికి చర్యలు చేపడుతాం. విద్యుత్​ వినియోగంపై ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి. నరేశ్, విద్యుత్ శాఖ ఎస్ఈ, మహబూబాబాద్​ జిల్లా