
- ఫెయిల్ అయిన ప్లాన్
- ఐదుగురు నిందితుల అరెస్టు
ఖమ్మం టౌన్, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను హత్య చేయించేందుకు చేసిన కుట్ర ఫెయిల్ అవ్వడంతో నిందితులు కటకటాల పాలయిన ఘటన ఖమ్మంలో వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలను ఖానాపురం హావేలి సీఐ భాను ప్రకాశ్ఆదివారం మీడియాకు వెల్లడించారు. ముదిగొండ మండలం సువర్ణాపురం గ్రామానికి చెందిన తోట ధర్మ భార్యతో అదే గ్రామానికి చెందిన కొండూరి రామాంజనేయులుకు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై భార్యతో ధర్మకు గొడవ జరుగుతోంది.
ఈ క్రమంలో ధర్మను హత్య చేసేందుకు ప్రియరాలితో కలిసి ప్రియుడు రామాంజనేయులు ప్లాన్ చేశాడు. ఈ విషయాన్ని ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం గ్రామానికి చెందిన దంతాల వెంకట రమణకు వివరించాడు. వెంకట రమణ తన స్నేహితుడైన రౌడీ షీటర్ పగడాల విజయ్ కుమార్ తో కలిసి ధర్మను హత్య చేసేందుకు రూ.20 లక్షల సుపారీ మాట్లాడుకున్నారు. పథకం ప్రకారం గతనెల 12న ఖమ్మం అర్బన్ మండలం లోని శశి దాబా వద్ద తోట ధర్మను కిడ్నాప్ చేసిన నిందితులు పలు నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లారు.
రామాంజనేయులుకు వీడియో కాల్ చేసి కిడ్నాప్ చేసిన ధర్మను చూపించారు. ధర్మను హత్య చేసేందుకు మరింత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రామాంజనేయులు కాల్ కట్ చేసి మళ్లీ అందుబాటులోకి రాలేదు. నిందితులు పలుమార్లు కాల్ చేసినా అతడి నుంచి స్పందన లేకపోవడంతో ధర్మను వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం ధర్మ తనకు ప్రాణహాని ఉందని ఈనెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఖానాపురం హావేలి పోలీసులు విచారణ చేపట్టారు.
ఆదివారం ఖమ్మం సిటీలోని చెరుకూరి మామిడి తోటలో నిందితులు ఉన్నట్లు పక్కా ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తోటలో ఉన్న నిందితులు రామాంజనేయులు, దంతాల వెంకట నారాయణ, పగడాల విజయ్ కుమార్, వేముల కృష్ణ, బుర్రి విజయ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి రెండు కత్తులు, ఎయిర్ గన్, రూ.90 వేల నగదు,సెల్ ఫోన్లు, కారు ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.