![రామరాజ్యం ఆర్మీ పేరుతో వసూళ్ల దందా.!](https://static.v6velugu.com/uploads/2025/02/five-more-arrested-for-attacking-chilkur-balaji-temple-head-priest-rangarajan_BsNea1oL7Z.jpg)
- ఫండింగ్ చేయనందుకే రంగరాజన్‌పై దాడి
- వెలుగులోకి వస్తున్న వీరరాఘవరెడ్డి అరాచకాలు
- హిందూ ధర్మ రక్షణ కోసమంటూ రామరాజ్యం సంస్థ ఏర్పాటు
- ‘రామరాజ్యం ఆర్మీ’ పేరుతో 25 మంది రిక్రూట్‌మెంట్
- ఇప్పటికే వీర రాఘవరెడ్డి సహా ఆరుగురు అరెస్ట్
- మరో 16 మంది కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్, వెలుగు: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వీర రాఘవరెడ్డి పాత నేరస్తుడు అని పోలీసుల దర్యాప్తులో తేలింది. అతడు ‘రామరాజ్యం’ పేరుతో వెబ్‌సైట్ ప్రారంభించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రామరాజ్యం ఆర్మీకి మద్దతు ఇవ్వాలని, ఫండింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డట్టు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి(45)ని శనివారం అరెస్ట్ చేయగా.. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడిలో మొత్తం 22 మంది పాల్గొన్నట్టు గుర్తించారు. వీరిలో తెలంగాణకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన 10 మందిని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఐడెంటిఫై చేశారు. ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో 16 మంది కోసం గాలిస్తున్నారు. కాగా, తొందరగా ఫేమస్ కావడం కోసమే రంగరాజన్ పై దాడి చేశామని పోలీసుల విచారణలో వీర రాఘవరెడ్డి చెప్పినట్టు తెలిసింది.
సోషల్ మీడియాలో ప్రచారం..
తూర్పు గోదావరి జిల్లా అన్నపర్తి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన కొవ్వూరి వీర రాఘవ రెడ్డి గత కొంత కాలంగా హైదరాబాద్ మణికొండలో నివాసం ఉంటున్నాడు. 2022లో ‘రామరాజ్యం’ పేరుతో వెబ్ సైట్ ప్రారంభించాడు. యూట్యూబ్, ఫేస్‌బుక్ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో ప్రచారం చేశాడు. అందులో భగవద్గీత శ్లోకాలను అప్‌లోడ్ చేసేవాడు. యువతను ప్రేరేపించే విధంగా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఆర్మీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం చేశాడు. ఈ క్రమంలోనే ‘రామరాజ్యం ఆర్మీ’ పేరుతో రిక్రూట్‌మెంట్ ప్రారంభించాడు. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రిక్రూట్‌మెంట్ చేశాడు. నెలకు రూ.20 వేల చొప్పున జీతం ఇస్తానని చెప్పి, 25 మందిని తన ఆర్మీలో జాయిన్ చేసుకున్నాడు. వీళ్లను గత నెల 24న ఏపీలోని పశ్చిమ గోదావరి తణుకుకు తీసుకెళ్లి మీటింగ్ నిర్వహించాడు. అక్కడ నాలుగు రోజులు ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కోటప్పకొండకు తీసుకెళ్లాడు. ఒక్కొక్కరి దగ్గర రూ.2 వేల చొప్పున తీసుకుని, వాళ్లకు బ్లాక్ యూనిఫామ్ కుట్టించాడు. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్ తీసుకొచ్చాడు.
మూడు కార్లలో రంగరాజన్ ఇంటికి..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యాప్రాల్‌లోని ఓ ఇంట్లో రామరాజ్యం ఆర్మీ సభ్యులందరూ సమావేశమయ్యారు. యూనిఫామ్ లో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ నెల 7న ఉదయం మూడు కార్లలో చిలుకూరుకు వెళ్లారు. ఉదయం 8 గంటలకు రంగరాజన్ ఇంటికి చేరుకున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం రామరాజ్యం ఆర్మీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఆర్మీలో యువతను రిక్రూట్ చేసుకోవడంతో పాటు వారికి నెల నెలా జీతాలు ఇస్తామని తెలిపారు. ఇందుకు తమ ఆర్గనైజేషన్‌కు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. చిలుకూరు టెంపుల్ నిర్వహణలోనూ తమకు భాగస్వామ్యం కల్పించాలని బెదిరింపులకు దిగారు. అయితే వీర రాఘవరెడ్డి చేసిన డిమాండ్లకు రంగరాజన్ అంగీకరించకపోవడంతో దాడికి పాల్పడ్డారు. దీనిపై మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో అదే రోజు వీరరాఘవ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కార్ నంబర్స్ గుర్తించారు. రంగరాజన్ ఇంటికి వచ్చిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు.