అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పోషకాహార లోపం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు, అందం కూడా మందగిస్తుంది. మొహంపై మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి చర్మ సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయటపడటానికి చాలామంది బ్యూటీ పార్లర్‌కు వెళ్తుంటారు.
ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైనవి అవిసె గింజలు. వీటితో ఆరోగ్యం మాత్రమే కాకుండా అందం కూడా సొంతమవుతుంది. అవిసె గింజలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి, జుట్టుకు మెరుపును ఇస్తాయి. ఈ గింజలతో తయారు చేసిన ప్యాక్ వేసుకుంటే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
ఫేస్ ప్యాక్ : ఒక టీస్పూన్ అవిసె గింజలను కప్పు నీటిలో వేసి అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత చిన్న మంటమీద నీరంతా జెల్‌గా మారేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత జెల్‌ను ముఖానికి పట్టించాలి. కాసేపటి తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న వాపు, మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.
రోజ్ వాటర్‌తో :అవిసెలను నీళ్లలో నానబెట్టి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టులో రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల అవిసె గింజల్లో ఉన్న పోషకాలు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి.
జుట్టు ఆరోగ్యానికీ : ఒక టీస్పూన్ అవిసె గింజల పొడిని చిన్న గిన్నెలో వేసి, ఒక గుడ్డును కొట్టి ఆ పొడిలో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, జుట్టుకు రాసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు మెరుస్తుంది. చర్మం కాంతిమంతంగా మారుతుంది