![ఏడుపాయల ఆలయానికి పోటెత్తిన వరద...పరవళ్లు తొక్కుతున్న మంజీరా](https://static.v6velugu.com/uploads/2023/07/Flood-Water-Flow-At--Edupayala-Durga-Bhavani-Temple_1xhM3ECdH0.jpg)
మెదక్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏడుపాయల వన దుర్గా అమ్మవారి ఆలయం దగ్గర మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. మంజీరా నదిలో సింగూరు జలాలు కలవడంతో అమ్మవారి ఆలయం జలదిగ్భందంలో చిక్కుకుంది. భారీ వరదలతో ఆలయం ముందు వరద ప్రవాహం ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో వనదుర్గామాత ఆలయాన్ని వరదనీరు చుట్టు ముట్టింది. అంతేకాకుండా ఆలయంలోకి వరద నీరు వచ్చిచేరుతుండటంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసేసిశారు అధికారులు. దీంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు నిర్వహిస్తున్నారు.
జులై 18 నుంచి కురుస్తున్న భారీ వర్షాలు కురవడంతో వనదుర్గా ఆలయ సమీపంలోని వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. వానలకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. జులై 20వ తేదీ ఉదయం 9237 క్యూసెక్కుల నీటిని అధికారులు మంజీరా నదిలోకి విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రతీ ఏడు వర్షాకాలంలో అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలో ఉండడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి కురుస్తు్న్న వర్షాలతో వనదుర్గా మాత అమ్మవారి ఆలయాన్ని వరదలు చుట్టుముట్టాయి. దీంతో అమ్మవారి దర్శనానికి వచ్చే వచ్చే భక్తులకు నిరాశ తప్పడంలేదు. రోజూ వేలాదిమంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. అయితే ప్రస్తుతం భారీ వానలు, వరదల కారణంగా భక్తుల రావద్దని అధికారులు సూచించారు.
ప్రకృతి ఒడిలో...పచ్చని చెట్ల మధ్యలో ..చుట్టూ చిన్న చిన్న రాతి నిర్మాణాల మధ్య ఉన్న సుందరమైన మందిరం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం. ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ కోరికలు నెరవేరతాయని భక్తులు నమ్ముతారు. ప్రతీ ఏడు వర్షాకాలంలో మంజీరా నది వరద ఈ ఆలయంలోపలికి ప్రవేశిస్తుంటుంది. దుర్గభావానీ అమ్మవారి పాదాలను కడుగుతుంది. ఈ అద్భుతమైన సంఘటనను చూడటానికి వేలాది మంది భక్తులు ఏడుపాయలకు తరలివస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆలయం దగ్గర వరద పోటెత్తడంతో ఆ ప్రాంతంలో వరద నీటి సవ్వడి తప్ప భక్తుల సందడి కనిపించడం లేదు.