- గద్వాల, జనగామ కలెక్టరేట్లలో పెట్రోల్ పోసుకోబోయిన అన్నదాతలు
- అడ్డుకోవడంతో తప్పిన ముప్పు
- లింగాల తహసీల్దార్ ఆఫీసులో మహిళ సూసైడ్ అటెంప్ట్
గద్వాల, వెలుగు : తాతల కాలం నుంచి వచ్చిన వ్యవసాయ భూమిని కబ్జా చేశారంటూ ఓ రైతు సోమవారం జోగులాంబ గద్వాల కలెక్టరేట్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయిజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన వడ్డె సవారన్నకు తాతల కాలం నుంచి సర్వే నంబర్ 321లో ఐదెకరాల భూమి ఉంది. ఆయనకు పరశురాం, కృష్ణ, తిమ్మప్ప కొడుకులు. తమ భూమి పక్కనే ఉన్న లోకేశ్వర్ రెడ్డి, కావలి గోవిందమ్మ, సత్యారెడ్డి, చాకలి శంకరమ్మ, మల్లారెడ్డి తమ పొలం కబ్జా చేశారని వడ్డె సవారన్న అయిజ పీఎస్, తహసీల్దార్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశాడు. అయినా వారు పట్టించుకోలేదు. తర్వాత ధరణిలో వేరే వ్యక్తుల పేర్లపైకి మార్చారు. దీంతో కలత చెందిన సవారన్న సోమవారం కుటుంబసభ్యులతో కలిసి కలెక్టరేట్ కి వచ్చాడు. మీటింగ్ హాల్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న అడిషనల్ కలెక్టర్ ముందే పరశురాం వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగేందుకు ప్రయత్నించాడు. దీంతో పక్కనే ఉన్నవారు అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి పరశురాంను బయటకు తీసుకెళ్లారు. తమ భూమి తమకు ఇప్పించి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
జనగామ కలెక్టరేట్లో..
జనగామ : తన భూమిని కబ్జా చేశారని ఆఫీసర్ల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదంటూ ఓ మహిళా రైతు జనగామ కలెక్టరేట్ ఆవరణలో ఆత్మహత్యకు యత్నించింది. జనగామ జిల్లా నర్మెటకు చెందిన దేవులపల్లి జ్యోతి జనగామలో ఉంటోంది. జ్యోతికి ఊరిలో వారసత్వంగా వచ్చిన 1.04 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని నర్మెటకు చెందిన ఓ రాజకీయ నాయకుడు కబ్జా చేశాడు. పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం తన ఇద్దరు పిల్లలను తీసుకుని జనగామ కలెక్టరేట్‌కు వచ్చింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడంతో పక్కనే ఉన్న వారు, పోలీసులు అడ్డుకొని జనగామ జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. ఆఫీసర్లు స్పందించి తన భూ సమస్యను పరిష్కరించాలని జ్యోతి కోరుతోంది.
తహసీల్దార్ ఆఫీస్‌లో పెట్రోల్ బాటిల్ తో మహిళ..
లింగాల : న్యాయం చేయాలని ఏండ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల తహసీల్దార్ ఆఫీస్‌లో ఓ మహిళ పెట్రోల్ బాటిల్ పట్టుకుని హల్ చల్ చేసింది. సర్వే నంబర్ 770 లో తనకు 1.30 ఎకరాల భూమి ఉండగా, దానిని కొందరు అక్రమించుకుని పట్టా చేసుకున్నారని లింగాలకు చెందిన గాలేటి జయమ్మ ఆరోపించింది. న్యాయం కోసం పదేండ్లుగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదని వాపోయింది. తన భూమి తనకు కావాలంటూ పెట్రోల్ బాటిల్ తో ఆఫీస్ కు వచ్చింది. ఇది గమనించిన అక్కడివారు బాటిల్ లాక్కున్నారు. అయినప్పటికీ ఆమె ఆందోళన చేయడంతో డిప్యూటీ తహసీల్దార్ పట్టాభి అక్కడకు వచ్చి ఆమె దగ్గరున్న పత్రాలు పరిశీలించారు. రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తానని చెప్పడంతో జయమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయింది.