ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ అరెస్ట్

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ అరెస్ట్
  • ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో అదుపులోకి

హైదరాబాద్‌/చేవెళ్ల, వెలుగు: ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీ. సీతారామాంజనేయులు (పీఎస్‌ఆర్‌‌)ను ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. బేగంపేటలోని ఆయన వియ్యంకుడి ఇంట్లో ఉదయం 5 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మొయినాబాద్‌ మండలం అమ్లాపూర్‌‌ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అనంతరం విజయవాడకు తరలించి సీఐడీ ఆఫీస్​లో విచారించారు. గురువారం కోర్టులో హాజరుపర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ కేసులో విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ విశాల్‌గున్నితో పాటు సీతారామాంజనేయలును ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. సీతారామాంజనేయులు జగన్ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. కాదంబరి జత్వానీ అరెస్ట్‌ వ్యవహారంలో సీతారామాంజనేయులు అప్పటి అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విజయవాడ నుంచి తప్పించుకుని మొయినాబాద్‌ అమ్లాపూర్ ఫామ్‌హౌస్‌లో ఉన్నట్లు ఏపీ సీఐడీ గుర్తించింది. బేగంపేటలో ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేసింది.