- మదర్ డెయిరీ మాజీ చైర్మన్ శ్రీకర్ రెడ్డి
యాదగిరిగుట్ట, వెలుగు : మదర్ డెయిరీ ఆస్తులను అమ్మాలని చూస్తే ఊరుకోమని, పాడి రైతులను సంఘటితం చేసి మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుడుతామని మదర్ డెయిరీ మాజీ చైర్మన్ శ్రీకర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. మదర్ డెయిరీ ఆస్తులను అమ్మితే సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.
స్థిరాస్తులు ఉంటేనే ఏ సంస్థ అయినా నడవడానికి ఆస్కారం ఉంటుందన్న ఆయన.. మదర్ డెయిరీ ఆస్తులు అమ్మితే సంస్థతో పాటు ఉద్యోగులు, పాడి రైతులు రోడ్డున పడే ప్రమాదముందన్నారు. ప్రస్తుత పాలకవర్గం చేతగానితనం వల్లే మదర్ డెయిరీకి నష్టాలు వస్తున్నాయని, అందుకే ఆస్తులు అమ్మాలని ప్రస్తుత చైర్మన్ మధుసూదన్ రెడ్డి కుతంత్రాలు పన్నుతున్నారని ఆరోపించారు.
ప్రస్తుత పాలకవర్గం అసమర్థత కారణంగా మదర్ డెయిరీ రోజువారీ పాల సేల్ 96 వేల లీటర్ల నుంచి 45 వేల లీటర్లకు పడిపోయి సంస్థ దీనావస్థకు చేరుకుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మదర్ డెయిరీ నష్టాల్లో ఉందని తెలిసినా.. మంత్రులు, ఎమ్మెల్యేలు పాలసంఘం చైర్మన్లను క్యాంపునకు తరలించి లీటర్కు రూ.4 బోనస్, ప్రభుత్వం నుంచి రూ.20 వేల గ్రాంటు, పెండింగ్ లో ఉన్న మూడు నెలల బిల్లులను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
మదర్ డెయిరీ డైరెక్టర్ కందాల అలివేలు రంగారెడ్డి, మాజీ డైరెక్టర్లు వెంకటరామిరెడ్డి, దొంతిరి సోమిరెడ్డి, పాలసంఘం చైర్మన్లు మారెడ్డి కొండల్ రెడ్డి, గడ్డం భరత్ గౌడ్, సందిళ్ల భాస్కర్ గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.