బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వేల సంఖ్యలో గ్రంథాలు, పుస్తకాలు చదివారని, ఆయన విపరీతంగా పుస్తకాలు చదువుతారని చాలామంది చెప్పారు. కానీ, గొప్ప వివాదాస్పద బ్రిటిష్ రాజకీయ నాయకుడు ఎనోక్ పావెల్ రచనలను కేసీఆర్ చదవలేదా అని నేను ఆశ్చర్యపోతున్నాను. బ్రిటిష్ పొలిటీషియన్ ఎనోక్ పావెల్ ప్రముఖంగా చెప్పిన వ్యాఖ్యలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ‘అన్ని రాజకీయాలు వైఫల్యంతోనే ముగుస్తాయి, అవి సంతోషకరమైన సమయంలో మధ్యలో విచ్ఛిన్నమైతే తప్ప’ అని ఎనోక్ పావెల్ పేర్కొన్నారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రులు పీవీ నరసింహారావు, రాజీవ్ గాంధీ, దేవెగౌడ, అటల్ బిహారీ వాజపేయిల కెరీర్‌లను మనం పరిశీలిస్తే ... ఈ గొప్ప నాయకులందరూ మన దేశానికి ప్రధానమంత్రులుగా అద్భుతమైన పాలన అందించారు. కానీ, కేరీర్ చివరిదశలో వారందరూ ఊహించనివిధంగా ఓటమిని ఎదుర్కొన్నారు. రాజకీయంగా మళ్లీ ఎన్నడూ పునరుత్తేజం కాలేకపోయారు.
మన్మోహన్ సింగ్ కూడా పదవి నుంచి వైదొలిగారు. అపర రాజకీయ చాణక్యుడిగా పేరు పొందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వంటి వారు సైతం మరణానికి ముందు ఘోర అవమానాలను చవిచూడాల్సి వచ్చింది. ఎనోక్ పావెల్ చెప్పినది ఏమిటంటే ‘రాజకీయాల్లో, మానవ జీవితంలో మీరు చివరికి వైఫల్యాన్ని ఎదుర్కొంటారు’ అన్నారు. కాగా, 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తన రాజకీయ వైభవంలో తారస్థాయికి చేరుకున్నారు. పదేండ్ల తన పాలన అనంతరం తెలంగాణలో కేసీఆర్ ఓటమి పాలయ్యారు. ఇక కేసీఆర్ మళ్లీ రాజకీయంగా ఎదుగుతాడా, తిరిగి ఆయన పార్టీ బీఆర్ఎస్ పునర్ వైభవం సాధిస్తుందా లేదా అన్నది పెద్ద ప్రశ్న. అయితే, రాజకీయంగా కేసీఆర్‌కు ఇంకా చాలా ఆప్షన్‌లు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పటికీ బలమైన ప్రాంతీయ పార్టీ అధినేతగా కొనసాగుతున్నారు.
కేసీఆర్ ముందున్న ఆప్షన్లు
కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలను జాగ్రత్తగా పున: పరిశీలించుకోవాలి. ఆయన పాలనలో జరిగిన తప్పులను క్షుణ్ణంగా పరిశీలించాలి. తెలంగాణ శాసనసభకు తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి వెనుక ఆయన చేసిన తప్పులు స్పష్టంగా ఉన్నాయి. తన పాలనలో ఎక్కడ తప్పు జరిగిందో, ఏ వ్యూహం బెడిసికొట్టిందో మాజీ సీఎం కేసీఆర్ గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి. అంతేగానీ, కేవలం కాంగ్రెస్, బీజేపీలు ఆయనపై లేనిపోని కల్పిత కథలు, అబద్ధాలు చెప్పాయని చెప్పి ఊరుకుంటే సరిపోదు. టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా భారత రాష్ట్ర సమితి పేరిట మార్చిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఇటీవల కేసీఆర్ తన ఎంపీలను కూర్చోబెట్టారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు అసాధ్యం అయితే కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.
100 సంవత్సరాల క్రితం జార్జ్ బెర్నార్డ్ షా చెప్పినట్లు..రాజకీయాలు వింత భాగస్వాములను తయారు చేస్తాయి. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కేసీఆర్ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చు. కానీ, ఆ ఆప్షన్ కొంచెం కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీకి నేరుగా బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునేందుకు అంతగా సుముఖతను చూపడం లేదు. బీజేపీ స్వతంత్రంగా ఎదగడానికి మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నది. మరోవైపు తెలంగాణ ఇప్పుడు జాతీయ పార్టీ పాలనలో ఉందని ప్రత్యేకంగా ఎత్తిచూపుతూ కేసీఆర్ తన పార్టీని పూర్తిగా ప్రాంతీయ పార్టీగా మార్చుకోవచ్చు. కేసీఆర్ ప్రాంతీయ సెంటిమెంట్‌ను అస్త్రంగా ఉపయోగించుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు మార్గాలను అన్వేషించవచ్చు. ఇది కేసీఆర్‌కు ఓ సమస్యగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది వ్యాపారవేత్తలైన ఎమ్మెల్యేలు, ఇతరులు అధికారంలో ఉన్న ప్రభుత్వం వైపు ఉండేందుకే మక్కువ చూపుతారు. కేసీఆర్ దీనిపై రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఆచితూచి వ్యవహరించాలి.
జాతీయ రాజకీయాలపై నజర్
కేసీఆర్ తన రాజకీయ పునర్ వైభవాన్ని సాధించాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. శత్రువులు విజయం సాధించినప్పుడు ఉల్లాసంగా ఉంటారు. అధికారం హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తన పాలనలో తప్పులు చేయడానికి కేసీఆర్ తగిన సమయం ఇవ్వాలి. అయితే, రాజకీయ నాయకులు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే ప్రభుత్వాన్ని రోజూ విమర్శించడం. ఈ విధానం ప్రభుత్వం తనను తాను సరిదిద్దుకోవడానికి అవకాశమిస్తుంది. నెపోలియన్ 200 సంవత్సరాల క్రితం ‘మీ శత్రువులు తప్పులు చేస్తున్నప్పుడు వారికి అంతరాయం కలిగించవద్దు’ అని చెప్పిన రాజకీయ సూత్రాన్ని కేసీఆర్ మననం చేసుకోవాలి. చాకచక్యంగా ఓటమిని ఎదిరించాలి. ఈ క్రమంలో కేసీఆర్ తన జాతీయ రాజకీయాలను వదిలిపెట్టకూడదు. కేసీఆర్ జాతీయ రాజకీయాలను విస్మరిస్తే ఆయన శత్రువులు సంబురాలు చేసుకుంటారు. అయితే, కేసీఆర్ ఓవర్ ఎనర్జిటిక్ గా ఉండకూడదు. కానీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ ఓటమి ప్రతిపక్షాల్లో పెద్ద ఖాళీని తెరిచింది. శరద్ పవార్, మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ ఆ ఖాళీలో తమ జాతీయ ఆకాంక్షలను పెంచుకున్నారనేది మరచిపోకూడదు.
కేసీఆర్‌కు వ్యక్తిత్వ మార్పు అవసరమా?
కేసీఆర్ తన ఫాంహౌస్‌ను విడిచిపెట్టడం లేదని, ప్రజలను ఆయన కలవడం లేదని చాలామంది విమర్శిస్తున్నారు. కేసీఆర్‌కు ఏది సౌకర్యంగా ఉందో అదే చేయాలని సూచిస్తున్నాను. తమిళనాడు రాజకీయ నాయకురాలు జయలలిత భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన రాజకీయ నాయకులలో ఒకరని ప్రజలందరికి తెలుసు. జయలలిత తన ఇంటి నుంచి ఎక్కువగా బయటకు వెళ్లలేదు. సాధారణ అన్నాడీఎంకే కార్యకర్తలను, నాయకులను ఎప్పుడూ నేరుగా కలవలేదు. మంత్రులు కూడా ఆమెకు దూరం పాటించాల్సి వచ్చింది. కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉండడం వల్ల ఓడిపోయారన్నది పూర్తిగా అవాస్తవం. భారతదేశంలోని చాలామంది రాజకీయ నాయకులు ప్రస్తుతం ప్రజలతో ఫేక్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అవి ప్రజలను మోసం చేయడానికి ఉన్న అవకాశాలు మాత్రమే. ప్రతి రాజకీయ నాయకుడికి తనదైన శైలి ఉంటుంది. కొందరు ప్రజా దర్బార్లు లేదా ఇతర విన్యాసాలు చేయవచ్చు. కానీ, చివరికి ప్రజలు ‘పరిపాలన’ గురించి తమ తీర్పు ఇస్తారు. రాజకీయ గిమ్మిక్కులు లేదా ఉచితాలే ప్రధానం కాదని పాలకులు గుర్తించాలి. కేసీఆర్ కూడా గరిష్టంగా ‘ఉచితాలు’ ఇచ్చినా ఎన్నికల్లో ఓడిపోయారు. పాలనాపరమైన సమస్యలతో కేసీఆర్ ఓడిపోయారు. కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా మెల్లగా మారాలి. అవసరం అయితేనే పంథాను మార్చుకోవాలి. తక్షణ మార్పు సత్ఫలితాలనివ్వదు. ఓటమికి భయపడి అలా చేశారని ప్రజలు భావిస్తారు. వారు ఎందుకు, ఎక్కడ విఫలమయ్యామనే దానిపై విస్తృత అధ్యయనం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
రాజకీయ చతురుడు కేసీఆర్
మే, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత, సోనియా గాంధీ ప్రముఖ కాంగ్రెస్ నేత, నిజాయతీపరుడైన రాజకీయ నాయకుడిగా పేరుపొందిన ఏకే ఆంటోన్నీని ఓటమికి గల కారణాలను అధ్యయనం చేయవలసిందిగా కోరారు. ఏకే ఆంటోనీ చిత్తశుద్ధితో ఓటమికి కారణాలను పేర్కొంటూ నిజాయతీతో కూడిన నివేదికను హైకమాండ్‌కు అందజేశారు. కానీ, సోనియా గాంధీ ఏనాడూ నివేదిక సూచనలను, సలహాలను అమలు చేయలేదు. కాగా, కేసీఆర్ కనీసం నిజాయతీపరుల ఓటమికి కారణాలేంటనేది రాబట్టాలి. వాస్తవం చెప్పాలంటే నాయకులందరి చుట్టూ స్నేహపూర్వక భజనపరులు మోహరించి ఉంటారు. కనీసం వారిని దూరంగా ఉంచాలి. కేసీఆర్‌కు గొప్ప రాజకీయ అనుభవం ఉంది, రాజకీయ చతురత ఉంది. ఎన్నికల సమయంలో అకస్మాత్తుగా కేసీఆర్ తనదైన దూకుడు శైలికి భిన్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూశాం. ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. కేసీఆర్ నెర్వస్‌గా ఉన్నారని ఆయన మారడానికి ప్రయత్నిస్తున్నారని ఇది తెలియజేస్తున్నది. కేసీఆర్‌పై చివరి అధ్యాయం ముగిసిందని నేను అనుకోవడం లేదు. ఆయనకు చాలా భవిష్యత్తు ఉంది. కానీ, కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉంది.
-పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్ ఎనలిస్ట్