సంక్షేమ పథకాలు అందరికివ్వాలి : హరీశ్​రావు

సంక్షేమ పథకాలు అందరికివ్వాలి : హరీశ్​రావు
  • మాజీ మంత్రి హరీశ్​రావు

గజ్వేల్, వెలుగు: సంక్షేమ పథకాలు అందరికివ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు డిమాండ్​చేశారు. ఆదివారం ఆయన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గ అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. ఒక్క లబ్ధిదారుడి నుంచి దరఖాస్తులు స్వీకరించకుండ అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దరఖాస్తుల మీద దరఖాస్తులే తప్ప పథకాలు వచ్చింది లేదన్నారు. గ్రామసభలు లేకుండానే సంక్షేమ పథకాలు అందించామన్నారు. సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్​ ప్రభుత్వం పేదల ఉసురు తీస్తున్నదన్నారు. దేవుడి మీద ప్రమాణాలు చేస్తూ ప్రజలకు అబద్ధాలు చెబుతూ ముందుకు సాగుతున్నారన్నారు. 

పుల్లూరు బండ జాతరకు ఏర్పాట్లు చేయాలి 

సిద్దిపేట రూరల్​: ఈ నెల 28  నుంచి జరిగే పుల్లూరు బండ జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని హరీశ్ రావు సూచించారు. ఆలయ అర్చకులు, గ్రామ నాయకులు సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ లో జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 28 నుంచి 31  వరకు జాతర ఉత్సవాలు జరుగుతాయని హరీశ్ రావుకు వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

అంతకుముందు సిద్దిపేట పట్టణం మూర్షద్ గడ్డ లోని దర్గాలో ఈ నెల 29 నుంచి 31 వరకు జరిగే ఉర్సు ఉత్సవాలకు రావాలని ఉత్సవ కమిటీ ఆహ్వానించింది. కార్యక్రమంలో అర్చకులు రంగాచార్య, వెంకట నర్సింహా చార్యులు, కృష్ణ మాచారి, రామకృష్ణ మాచార్యులు, మాజీ సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి,  మాజీ సర్పంచ్ పల్లె నరేశ్ గౌడ్ పాల్గొన్నారు.