మర్రిగూడ చౌరస్తాలో ముంపు బాధితుల రాస్తారోకో

నల్లగొండ: చర్లగూడెం, కిష్టరాయనిపల్లి ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మర్రిగూడెంలో చర్లగూడెం, కిష్టరాయినిపల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో గురువారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారులు స్పందించి ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు నిరసన విరమించేదిలేదని హెచ్చరించారు.

 

ప్రభుత్వం తమ విలువైన భూముల్ని గుంజుకుని రోడ్డున పడేసిందని భూ నిర్వాసితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇప్పటివరకు సరైన నష్టపరిహారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. దీక్షలో ఉన్న ఒకరికి ఆరోగ్యం క్షీణించి.. బీపీ లెవల్స్ తగ్గి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో కిష్టముంపు బాధితులు మర్రిగూడ చౌరస్తాలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.