కేసీఆర్, కేటీఆర్ పోరాటం వల్లే ఎయిర్ పోర్ట్ : బోయినపల్లి వినోద్ కుమార్

కేసీఆర్, కేటీఆర్ పోరాటం వల్లే ఎయిర్ పోర్ట్ : బోయినపల్లి వినోద్ కుమార్
  • మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ 

వరంగల్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ 15 ఏండ్ల పోరాటం వల్లే మామునూరు ఎయిర్​పోర్టు వచ్చిందని, ఆ క్రెడిట్​ సీఎం రేవంత్​రెడ్డికి వీసమెత్తు కూడా దక్కదని మాజీ ఎంపీ, రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​ కుమార్​ అన్నారు. ​ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్​ఎస్​ ఆఫీసులో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్దితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ మామునూరు ఎయిర్ పోర్టు కోసం బీఆర్​ఎస్​ హయాంలోనే 253 ఎకరాలను గుర్తించి రైతులతో సంప్రదింపులు చేశారని, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. గతంలో కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరిని కేటీఆర్ తో కలిసి వెళ్లి మామునూరు అంశం మాట్లాడి ఒప్పించామన్నారు. సీఎం రేవంత్ రెడ్ది ఎయిర్​ పోర్ట్ రాకతో 15 ఏళ్ల పోరాట ఫలితమని చెప్పుంటే, తాము మాట్లాడే వాళ్లం కాదని చెప్పారు. కానీ తానే తీసుకొచ్చానని చెప్పుకోవడం తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులను కించపర్చడమే అన్నారు. 

ఉత్తర తెలంగాణ జిల్లాలకు సర్వీసెస్ అందించడానికి మామునూరు ఎయిర్ పోర్ట్ కీలకం కానుందన్నారు. రేవంత్ సర్కార్ ఫ్లయింగ్ ట్రైయినింగ్ ఆర్గనైజేషన్ మామునూరుకు తీసుకురావాలని, బోయింగ్, ఎయిర్ బస్, ఇండిగో విమానాల రిపేరింగ్ సెంటర్స్ వరంగల్ కు తీసుకురావాలన్నారు. నాగ్ పూర్, అమరావతి ప్రాంతాలకు ఫ్లయింగ్ ట్రైయినింగ్ ఆర్గనైజేషన్ తీసుకెళ్లాలని ఆయా రాష్ట్రాలు పోటీ పడుతున్నట్లు తెలిపారు. పన్ను రాయితీలు ఇచ్చి మామునూరుకు తీసుకురావాలి తప్పితే వాయుదూత్ మాదిరి నాలుగు విమానాలు నడిపి ఆపై మూసే కుట్ర చేయొద్దన్నారు. మామునూరు ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, కేంద్రానికి ధన్యవాదాలుతెలిపారు..

వినయ్ భాస్కర్, ధర్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అప్పటి ఒత్తిడి ఫలితంగానే ఎయిర్ పోర్టు కు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. పరకాల నియోజకవర్గంలో ఎయిర్​ పోర్టు కోసం పోయే భూములకు మంత్రి కొండా సురేఖ బాధ్యత వహిస్తారా, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రాష్ర్ట  రైతు విమోచన కమిషన్​ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.