
- బంజారా, లంబడాల భాషను 8వ షెడ్యూల్‌లో చేర్చాలి: మాజీ ఎంపీ రవీంద్ర నాయక్
న్యూఢిల్లీ, వెలుగు: ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ అంటోన్న కేంద్ర ప్రభుత్వం.. ‘వన్ నేషన్ – వన్ బంజారా’ ఎందుకు చేయకూడదని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ప్రశ్నించారు. బంజారా, లంబాడాలు మాట్లాడే భాషను రాజ్యాం గంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇందు కోసం తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని కోరారు.
సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రవీంద్ర నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాల ముందు ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతంగా కేటాయించిన రిజర్వేషన్లను.. ప్రస్తుత జనాభా ప్రకారం ఎస్సీలకు 19 శాతం, ఎస్టీలకు 12 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. దేశంలో 16 పేర్లతో పిలువబడే బంజారాల భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నామని చెప్పారు. వీరి భవిష్యత్ కోసం ప్రత్యేక వర్సిటీలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.