
ఎల్లారెడ్డిపేట, వెలుగు: నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి కొడుకుకు తన ఉద్యోగం ఇప్పించాలని చూసిన ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్ వివరాల ప్రకారం గొల్లపల్లి ప్రైమరీ వెటర్నరీ హాస్పిటల్‌లో జడ కొమురయ్య లైవ్ స్టాక్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నాడు. తనకు లివర్ సంబంధిత వ్యాధి ఉందని, తనకు మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టాడు. దీనికి సంబంధించి కలెక్టరేట్‌లో వెరిఫికేషన్ఆఫీసర్లు.. కొమురయ్యకు ఆరోగ్యానికి సంబంధించిన పత్రాలు, స్టాంపులు, సంతకాలు నకిలీవిగా గుర్తించారు.
దీంతో ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రమాకాంత్‌కు సమాచారమిచ్చి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయగా.. కొడుకుకు ఉద్యోగం పెట్టియ్యాలన్న ఉద్దేశంతో కొమురయ్య కరీంనగర్‌లోని రిటైర్డ్ తహసీల్దార్ బీరయ్యను సంప్రదించారు. ఆయన రూ.3లక్షలు తీసుకొని డీఎంహెచ్‌వో ఆఫీసులో పనిచేసే మహమ్మద్ బాసిద్, ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ కొత్తపల్లి రాజేశం సహకారంతో తప్పుడు పత్రాలు సృష్టించారు. శుక్రవారం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీనిపై సీఐను వివరణ కోరగా విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.