
- టెట్, డీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్, వీఆర్ఏ, వీఆర్వో పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అవకాశం
- ఫస్ట్ బ్యాచ్ లో 1,500 మందికి ట్రైనింగ్
- హైదరాబాద్‌కు చెందిన సబ్జెక్టు నిపుణులతో శిక్షణ
మహబూబ్‌నగర్, వెలుగు: పాలమూరులో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ఫోకస్ పెట్టారు. రానున్న జూన్, జులైలో టెట్, డీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్-1, 2, 3, వీఆర్ఏ, వీఆర్వో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో మహబూబ్‌నగర్‌కు చెందిన నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బుధవారం నుంచి నిరుద్యోగ యువతకు ఫ్రీ కోచింగ్ సెంటర్ క్లాసులను ప్రారంభిస్తున్నారు.
వెయ్యి అప్లికేషన్లు
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో బుధవారం ఉదయం పది గంటల నుంచి ఫ్రీ కోచింగ్ క్లాసులను ప్రారంభిస్తున్నారు. 90 రోజుల పాటు క్లాసులు ఉంటాయి. రోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు జరుగుతాయి. రెండు రోజుల కిందట మూడు వేల అప్లికేషన్లను రెడీ చేశారు. వాటిలో కొన్నింటిని మహిళా సంఘాల సభ్యులకు అప్పగించి, వారు నివాసం ఉంటున్న ప్రాంతంలో యువతకు అందించేలా చర్యలు చేపట్టారు.
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో అప్లికేషన్లను అందుబాటులో ఉంచారు. ట్రైనింగ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్లు ముందుగా ఈ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. విద్యార్హత, ఇంటి అడ్రస్, ఏ పోస్టు కోసం కోచింగ్ తీసుకోవాలని అనుకుంటున్నారు, ఆధార్, ఫోన్ నంబరు అప్లికేషన్లో రాసి, అప్లికేషన్‌ను ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు లేదా అంబేద్కర్ కళా భవన్లో సడ్మిట్ చేయాలి. ఇప్పటి వరకు అప్లికేషన్లు పంపిణీ పూర్తి కాగా.. మంగళవారం రాత్రి వరకు వెయ్యి మంది దరఖాస్తులు చేసుకున్నారు. బుధవారం ఉదయం వరకు దాదాపు రెండు వేల అప్లికేషన్లు వచ్చే చాన్స్ ఉంది.
హైదరాబాద్ ఫ్యాకల్టీతో క్లాసులు
కోచింగ్ సెంటర్‌లో సబ్జెక్టులు చెప్పడానికి సబ్జెక్టు నిపుణులను రప్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్ సెంటర్లకు చెందిన ఫ్యాకల్టీ సేవలను వినియోగిస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చు ఎమ్మెల్యే యెన్నం తన సొంత నిధులు భర్తిస్తుండటంతో పాటు దాతల సహకారం తీసుకుంటున్నారు. కోచింగ్ సెంటర్‌లో ఆయా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి వేర్వేరుగా క్లాసులు చెప్పనున్నారు.
ప్రస్తుతం అంబేద్కర్ కళాభవన్‌లో క్లాసులను స్టార్ట్ చేస్తుండగా.. అక్కడ వెయ్యి నుంచి 1,500 మంది కెపాసిటీ ఉంది. కోచింగ్‌కు వచ్చే వారు పెరిగితే అదనంగా ప్రైవేట్ బిల్డింగ్‌ను అద్దెకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కోచింగ్ సెంటర్‌లో అర్థమెటిక్, రీజనింగ్, సోషల్, సైకాలజీ, మెథడాలజీ, జనరల్ స్టడీస్, ఇంగ్లిష్ తదితర సబ్జెక్టులతో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి గ్రౌండ్లో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్‌పై శిక్షణ ఇవ్వనున్నారు.
నైపుణ్యాలను వెలికి తీసేందుకు టెస్టులు
కోచింగ్ సెంటర్‌లో క్లాసులకు హాజరవుతున్న వారికి ఆయా పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ఫ్రీగా ఇవ్వనున్నారు. కోచింగ్ 90 రోజుల పాటు ఉంటుంది. సిలబస్ త్వరగా పూర్తి అయితే 80 రోజుల్లో క్లాసులు ముగిస్తారు. రాష్ర్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ కూడా ఈ కోచింగ్ సెంటర్‌లో క్లాసులు చెప్పేందుకు కూడా సిద్ధం అయ్యారు. గ్రూప్స్, డీఎస్సీ, టెట్, ఎస్ఐ ఇతర పోటీ పరీక్షల్లో అర్హత సాధించి ఆయా పోస్టుల్లో ఉన్న వారితో యువతకు ప్రతి వారం మోటివేషన్ క్లాసులు ఇప్పించనున్నారు. ఆయా సబ్జెక్టుల్లో చాప్టర్ వారీగా వీక్లీ టెస్టులు నిర్వహిస్తారు. ఎప్పటికప్పుడు అసైన్మెంట్లు, యూనిట్ టెస్టులు పెట్టి, విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించనున్నారు.
కోచింగ్‌లో జాయిన్ అవుతా
మా అమ్మా, నాన్న రోజు వారీ కూలీ పనులు చేస్తూ.. మమ్మల్ని చదివిస్తున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకున్నా. హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు లేక ఇంట్లోనే ఉంటూ ప్రిపేర్ అయ్యా. ఎగ్జామ్‌లో రాణించలేపోయా. ప్రస్తుతం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పోటీ పరీక్షలు రాసే వారికి ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తున్నట్లు తెలిసింది. వెంటనే అప్లికేషన్ పెట్టుకొని, కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవుతా.- చందు, మణికొండ గ్రామం, మహబూబ్‌నగర్ రూరల్ మండలం