ఫ్రాన్స్ అధ్యక్ష పీఠం మరోసారి ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ నే వరించింది. వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా గెలిచారు. ఎన్నికల్లో మెక్రాన్ కు 58 శాతం ఓట్లురాగా.. ప్రత్యర్థి మరీన్ లీ పెన్ కు 42 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో అధికారిక ఫలితాలు రాకముందే లీపెన్ తన ఓటమిని అంగీకరించారు. మెక్రాన్ విజయంతో ఆయన మద్దతుదారులు ఈఫిల్ టవర్ ముందు జాతీయ గీతాన్ని పాడుతూ యూరోపియన్ జెండాలు ఊపారు.
ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్ లీ పెన్ పైన గెలిచి 39 ఏళ్ల మాక్రాన్ ఫ్రాన్స్ లో అతి చిన్న వయసుగల అధ్యక్షుడిగా రికార్డుకెక్కారు. గడిచిన 20 ఏళ్లలో వరుసగా రెండుసార్లు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికై మెక్రాన్ మరో రికార్డు సృష్టించారు. రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతల మధ్య మెక్రాన్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్ లో నాయకత్వ స్థిరత్వానికి హామీ ఇచ్చినట్లైందని రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
మెక్రాన్ విజయంతో ప్రపంచ వ్యాప్తంగా నాయకుల నుంచి అభినందనలు అందుతున్నాయి. మెక్రాన్ గెలుపుపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారత్, ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేసేందుకు మరోసారి కలిసి పనిచేద్దామన్నారు ప్రదాని మోడీ. మెక్రాన్ తో కలిసి ఫ్రాన్స్, ఐరోపాలను మరించ అభివృద్ధి చేస్తామని ట్వీట్ చేశారు ఈయూ చీఫ్ ఉర్సులా వాండర్ లేయెన్. ఫ్రాన్స్ అత్యంత సన్నిహిత, ముఖ్యమైన దేశాల్లో ఒకటని.. అధ్యక్షుడిగా ఎన్నికైన మెక్రాన్ కు అభినందనలు తెలిపారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. మరోవైపు మెక్రాన్ ఎన్నికకు నిరసనగా పలువురు ఆందోళనకారులు రోడ్లెక్కారు.