ఈ ఊళ్లో ఇండ్లన్నీ ఒకేలా ఉంటాయి

ఆ ఊళ్లో ఇండ్లన్నీ ఒకేలా ఉంటాయి. ఒకే ఎత్తు, ఒకే రకమైన రంగుతో చూడముచ్చటగా ఉండి, అచ్చం బొమ్మరిండ్లలా కనిపిస్తాయి. వాటి వల్లే ఈ ఊరు చాలా ఫేమస్​ అయింది. పేరు ఫ్రూడెన్ బర్గ్. మంచు పడినప్పుడు ఈ ఊరి అందం రెట్టింపవుతుంది. బొమ్మరిల్లు లాంటి ఆ ఊరు ఎక్కడుంది? అక్కడ ఇంకా ఏమేం స్పెషాలిటీస్​ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
జర్మనీలోని అందమైన చిన్న గ్రామం ఫ్రూడెన్ బర్గ్. ఇది నార్త్ రైన్ వెస్ట్​ఫాలియా రాష్ట్రంలో ఉన్న సైగెన్ విట్గెన్​స్టెయిన్ జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 500 మీటర్ల ఎత్తులో ఉంది.1389లో ఆ ఊరి గురించి, అక్కడ ఉన్న కోట గురించి రాశారు. అలా ఆ ఊరి గురించి మిగతావాళ్లకు తెలిసింది. ఆ ఊరి గురించి చెప్పుకోవాలంటే ముందు ఆ కోట గురించే చెప్పేవారు. ఫ్రూడెన్ బర్గ్ చూడ్డానికి అచ్చం కార్టూన్​ సినిమాల్లో కనిపించే ఊరిలా ఉంటుంది. ఇండ్లు కార్డ్ బోర్డు షీట్​, వైట్ పేపర్​తో తయారుచేసినట్టు ఉంటాయి. పైగా రంగురంగుల బిల్డింగ్​లు, చిన్న ఇల్లు, పెద్ద అపార్ట్​ మెంట్ అని ఉండవు. అన్నీ ఒకేలా ఉంటాయి. 
ఎన్ని సార్లు కట్టారో...!
1540లో  కోటతో పాటు ఫ్రూడెన్ బర్గ్ కూడా మంటల్లో చిక్కుకుని పెద్ద ఎత్తున డ్యామేజ్​ అయింది. ఆ తర్వాత విలియం ద రిచ్​ ఆదేశాల మేరకు16వ శతాబ్దం మధ్యకాలంలో కొత్త బిల్డింగ్ పనులు మొదలుపెట్టారు. మార్కెట్​ టౌన్​కి కొత్తగా నాలుగు గేట్లు ఏర్పాటు చేశారు. నాలుగు దిక్కుల్లో ఉన్న ఆ గేట్లకు పేర్లు కూడా పెట్టారు. అవి ‘హొహెన్​హైనెర్​ టోర్​’, ‘వెయిహెర్​టోర్’, ‘బ్రాస్​టోర్’, ‘స్కల్​టోర్’. ‘టోర్’ అంటే గేట్​ అని అర్థం. ఇలా నాశనమైన ప్రదేశమంతా మళ్లీ కొత్తగా రూపు దిద్దుకుంది. దాంతో ఆ ఊరికి కొత్త కళ వచ్చింది. కొన్నేండ్ల పాటు అంతా బాగానే ఉంది. కానీ... 1666, ఆగస్ట్ 9న మళ్లీ మంటల్లో తగలబడింది ఆ ఊరు. కొత్తగా కట్టిన నిర్మాణాలన్నీ మరోసారి కాలి బూడిదయ్యాయి.  
ఆ తర్వాత ప్రిన్స్ జొహాన్ మోరిట్జ్ వాన్ నాసు సైగెన్ మళ్లీ ఆ ఊరిని కట్టించడం మొదలుపెట్టాడు. అయితే,1540లో ఎలా కట్టించారో, అంటే కాలిపోక ముందు ఆ ఊరు ఎలా ఉందో... అచ్చం అలాగే తిరిగి కట్టించాలని ప్లాన్​ చేయించాడు. కానీ, ఫ్రూడెన్​ బర్గ్​ కోట మాత్రం మళ్లీ కట్టించలేదు. దాంతో ఆ కోట తాలుకా కొన్ని శిథిలాలు అలాగే ఉండిపోయాయి. ఈరోజుకీ వాటిని అక్కడ చూడొచ్చు.

ఇక ఆ తర్వాత మళ్లీ ఆ ఊరి గురించి ఎక్కడా వినిపించలేదు. చాలా కాలం గడిచిపోయింది.1969లో, అక్కడున్న పదిహేడు మునిసిపాలిటీల్లో ఒకటిగా ఫ్రూడెన్​బర్గ్​ స్థానం పొందింది. ప్రస్తుతం ఇది టూరిజం ప్లేస్. ప్రతి ఏటా పిల్లలు, పెద్దలు ఫ్రూడెన్​ బర్గ్​కి వెళ్తుంటారు. ఏడాదికి50వేల మంది విజిటర్స్​తో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. వాళ్లంతా ఓపెన్ ఎయిర్​ స్టేజ్​ మీద ఆటపాటలతో ఎంజాయ్​ చేసి వెళ్తారు. 
ఆ మ్యూజియం చారిత్రకం 
ఆ ఊళ్లో ఒక మ్యూజియం కూడా ఉంది. దాని పేరు ‘స్టాడ్​ మ్యూజియం’. అందులో లోకల్, ఎకానమీ, హిస్టరీల సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ తప్పకుండా చూడాల్సింది మాత్రం గోడ గడియారాల కలెక్షన్​. టెక్నికల్ మ్యూజియంలో ఆ ప్రాంతంలో జరిగే ట్రేడ్, ఇండస్ట్రియల్ హిస్టరీకి సంబంధించినవి ఉంటాయి. మ్యూజియంలో సెంటరాఫ్ అట్రాక్షన్​గా చెప్పుకునేది1904లో తయారుచేసిన స్టీమ్​ ఇంజిన్. వీరితోపాటు రకరకాల చక్రాలున్న వెహికల్స్ డిస్​ ప్లేలో కనువిందు చేస్తాయి.
కలపతో కట్టిన ఇండ్లు
ఫ్రూడెన్ బర్గ్​ లోపల ‘ఆల్టర్ ఫ్లెకెన్’ అనే ప్రాంతం ఉంది. అక్కడ అంతా సగభాగం కలపతో కట్టిన ఇండ్లు కనిపిస్తాయి. అది17వ శతాబ్దం నాటి చిన్న టౌన్​లా అనిపిస్తుంది. ఆల్టర్ ఫ్లెకెన్ అనేది కల్చరల్ అట్లాస్ ఆఫ్​ ది స్టేట్ ఆఫ్​ నార్త్ రైన్​ వెస్ట్ ఫాలియాలో ఒకటి. అంటే ప్రసిద్ధ భవంతుల కట్టడంలో అంతర్జాతీయం​గా పేరు పొందిందన్నమాట. అంతేకాకుండా ‘ఒబెర్లాజ్ క్లేవ్’ కమ్యూనిటీలో ఒక చర్చ్​ ఉంది.

అది తప్పకుండా చూడాల్సిన కట్టడం. ఎందుకంటే అది ఇప్పటిది కాదు. అది13వ శతాబ్దం మొదట్లో కట్టింది. అది చూడ్డానికి రోమన్లు కట్టినట్టు ఉంటుంది. ఆ చర్చి ఆర్చిటెక్చర్ అంతా రోమన్​​ స్టైల్​లో ఉంటుంది. అంతేకాదు, సగభాగం కలపతో కట్టిన ఈ ఇండ్లు సినిమాల్లోనూ కనిపిస్తుంటాయి. డెట్లవ్​ బక్ అనే జర్మనీ డైరెక్టర్ తీసిన ‘లీబెస్ లూడర్’ అనే సినిమాలో కనిపించింది. అలాగే ‘లూపో అండ్​ డెర్ మ్యుజ్జిన్’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్​ ఈ ఊళ్లోనే షూటింగ్ చేశారు. అలా బోలెడు సినిమా షూటింగ్​లు జరుగుతుంటాయి ఇక్కడ. 


చూడదగ్గవి
ఫ్రూడెన్ బర్గ్​లో 4 ఫాచ్ వెర్క్​ మిట్టెండ్రిన్​ అనే ఆర్ట్ మ్యూజియం కూడా ఉంది. ఇది కూడా సగభాగం కలపతో కట్టిన భవనమే. ఇందులో ఆర్ట్, హిస్టరీ, క్రియేటివిటీకి సంబంధించినవి కనిపిస్తాయి. సరిగ్గా ఊరి మధ్యలో ఉండే ‘‘అల్టెన్ ఫ్లెకెన్” అంతర్జాతీయంగా ఊరికి దక్కిన గుర్తింపును చెప్తుంది. వర్క్‌‌షాప్, గ్యాలరీలు ఉంటాయి. ఆర్ట్ ఎగ్జిబిషన్‌‌లు జరుగుతాయి. మొదటి నుంచి వాచ్‌‌లు తయారు చేయడం ఇక్కడ చాలా స్పెషల్. వాచ్ మేకింగ్, టిక్కింగ్ ఎగ్జిబిషన్​లు చూడొచ్చు. 

ఎలా వెళ్లాలి?
 హైదరాబాద్​ నుంచి బెర్లిన్​ (జర్మనీ)కి విమానంలో వెళ్లాలి. ఇది దాదాపు13 గంటల జర్నీ. దానికి 33 వేల నుంచి ఫ్లైట్ టికెట్​ ఉంటుంది. ఆ తర్వాత బెర్లిన్ నుంచి ఫ్రూడెన్​బర్గ్​కి ట్రైన్​లు ఉంటాయి. ట్రైన్​లో వెళ్తే 6 గంటలు పడుతుంది. ట్రైన్ టికెట్ 3, 300 నుంచి మొదలవుతుంది. బెర్లిన్​ నుంచి ఫ్రూడెన్ బర్గ్​కి వారానికి దాదాపు 70 ట్రైన్​లు ఉంటాయి. వీకెండ్స్​లో వెళ్లాలనుకుంటే ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్. మే నుంచి సెప్టెంబర్ వరకు టూర్​ వేయడానికి బెస్ట్ టైం.