నియంతను నిరుద్యోగులే..ఇంటికి పంపుతరు

గత కొద్ది వారాలుగా కేసీఆర్ కుటుంబంతోపాటు బీఆర్ఎస్ నాయకుల్లో తీవ్ర అసహనం కనిపిస్తున్నది. ఫ్రస్ట్రేషన్‌‌‌‌ పరాకాష్టకు చేరింది. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపైనా పోరాడే ప్రతిపక్ష పార్టీల నాయకులను నోటీసుల పేరుతో బెదిరిస్తున్నరు. గృహ నిర్బంధాలకు గురి చేస్తున్నరు. లాఠీలు ఝుళిపిస్తూ కేసులు పెడుతున్నరు. ప్రశ్నించే మీడియా సంస్థలనూ వదలడం లేదు. కేసీఆర్ కుటుంబ తప్పిదాలను ఎండగడుతున్న జర్నలిస్టులపై దాడులు చేస్తున్నరు. కేసులు పెట్టించి జైళ్లకు పంపుతున్నరు. తమకు గిట్టని ఛానల్, పేపర్లను నిషేధిస్తున్నారు. ఆ పార్టీ నేతల్లో ఇంతటి అసహనానికి కారణమేంటి? పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లు దళితుడిని ముఖ్యమంత్రి చేయనందుకా? దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వనందుకా? డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌ ఇండ్లు కట్టలేనందుకా? లేక నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చలేక పోయినందుకా? నిరుద్యోగ భృతి, పోడు భూముల పట్టాలు ఇవ్వనందుకా? ఇవేవీ కావు. ఢిల్లీ దొంగ సారా దందా(లిక్కర్‌‌‌‌ స్కామ్‌‌‌‌)లో  కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటుండటం.. టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కేసీఆర్ కొడుకును క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ తెలంగాణ సమాజం నుంచి ఒత్తిళ్లు రావడమే అసలు కారణం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎనిమిదిన్నరేళ్లపాటు ఎదురేలేదన్నట్లుగా ఏకచత్రాధిపత్యం కొనసాగిస్తున్న అవినీతి-, కుటుంబ, -నియంత పాలన చేస్తున్న కేసీఆర్ కు తన వారసులు అవినీతిలో కూరుకుపోవడంపై వాళ్ల రాజకీయ భవిష్యత్ ఏమైపోతుందోననే ఆందోళనే అసలు ఫ్రస్ట్రేషన్‌‌‌‌  కు కారణంగా కనిపిస్తున్నది. 

ప్రేమ ఎవరి మీద?

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, సమస్యలను ఏనాడూ పట్టించుకోకుండా ఫాంహౌస్ కే పరిమితమైన కేసీఆర్.. బిడ్డ, కొడుకు, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు అవినీతికి బార్లా తలుపులు తెరుస్తుంటే సప్పుడు చేయలేదు. ఇవాళ టీఎస్​పీపీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నా, గూడు లేక కోటి మందికిపైగా అల్లాడుతున్నా,  పంటకు గిట్టుబాటు ధర రాక, అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఏరులై పారుతున్న మద్యంతో మహిళల తాళి బొట్లు తెగిపడుతున్నా ఏనాడూ పట్టించుకోని కేసీఆర్... తన  కొడుకు, బిడ్డ అవినీతి, అక్రమాల్లో కూరుకుపోతే తట్టుకోలేక అల్లాడుతున్నారు. వాళ్లను కాపాడుకునేందుకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకూ వెనుకాడటం లేదు. బిడ్డ ఈడీ విచారణకు వెళ్తే, క్యాబినెట్ మంత్రులను, పార్టీ నాయకులను ఢిల్లీకి పంపారు. ప్రభుత్వం తరఫున వాదించాల్సిన రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ ను ఆయన కూతురు కోసం ఈడీ కార్యాలయానికి పంపారు. 4 కోట్ల మందికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రికి ఎవరిపట్ల ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టే అర్థమవుతోంది.

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ తీరు.. గుమ్మడికాయ చందం

గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుంది బీఆర్ఎస్ తీరు. ఢిల్లీ లిక్కర్‌‌‌‌ స్కామ్‌‌‌‌లో తామేమీ తప్పు చేయనట్లయితే నిజాయితీగా దర్యాప్తును ఎదుర్కోవాలి. సాక్ష్యాధారాలను మాయం చేశారనే విమర్శ నుంచి బయటపడాలి. అట్లాగే టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కొడుకు పాత్ర లేదని నిరూపించుకోవాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సకాలంలోనే పరీక్షలు నిర్వహించి నియామకాల ప్రక్రియను భర్తీ చేసి నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలి. బీఆర్ఎస్ నేతలు ఆ పని చేయకుండా లిక్కర్‌‌‌‌, పేపర్ లీకేజీ స్కామ్​ల నుంచి తెలంగాణ ప్రజల దృష్టి మరల్చేందుకు నానా యాగి చేస్తున్నారు. బట్టకాల్చి మీద వేసినట్లుగా తాము చేసిన అక్రమాలు బయట పడకుండా ఇతరులపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. పేపర్ లీకేజీ వెనుక బీజేపీ కుట్ర ఉందంటూ సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారు. 

అలజడులు సృష్టించే కుట్రలో భాగమేనా?

ఢిల్లీ లిక్కర్‌‌‌‌ స్కామ్‌‌‌‌ లో తమకు లభించిన ఆధారాలతో ఈడీ ఇప్పటికే కొందరిని అరెస్ట్‌‌‌‌ చేసింది. అదే విధానంలో ఈడీ కేసీఆర్ బిడ్డను అరెస్ట్‌‌‌‌ చేస్తే దాన్ని ఉపయోగించుకుని తెలంగాణలో అలజడులు సృష్టించాలని బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దానికి రాజకీయ రంగు పులిమి బీజేపీని దోషిగా చేయాలనేది వారి వ్యూహం. తద్వారా కేసీఆర్ పుత్ర రత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న పేపర్ లీకేజీ కేసును కూడా దారి మళ్లించవచ్చని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల సమస్యను మరింత జటిలం చేసి తాము చేసిన పాపాలను కడిగి వేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. చైతన్యవంతమైన తెలంగాణ సమాజం బీఆర్ఎస్ కుట్రలను ఏమాత్రం సహించదు. నూరు తప్పులు నిండిన తర్వాత శిశుపాలుడనే రాక్షసుడు అంతమయ్యాడు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనలో జరిగిన అనేక తప్పులను గమనిస్తూ వచ్చారు. బిడ్డ లిక్కర్ స్కామ్, కొడుకు పేపర్ లీకేజీ స్కామ్​తో కేసీఆర్ పాలనకు ఇక నూకలు చెల్లే రోజు వచ్చినట్లుగా తెలంగాణ సమాజం భావిస్తోంది. బీఆర్ఎస్ నాయకుల్లో ఇంతపెద్దఎత్తున అభద్రత కలగడానికి కారణం ఏమిటి? టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను కేసీఆర్‌‌‌‌ బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధుల్లో  తీవ్రమైన ఆందోళన ప్రారంభమైంది. ప్రజల్లో విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాం, కనీసం పార్టీ పేరులోనైనా తెలంగాణ అని ఉంటే గట్టెక్కుతాం అనుకుంటే ఇప్పుడు అదీ లేదు. బడాయికి పోయి బీఆర్ఎస్ గా పేరు మార్చుకోవడంతో అసలుకే ఎసరు వచ్చేటట్లుగా ఉందని మథనపడుతున్నారు.

తెలంగాణ తలవంచదు

ఈడీ మొదటిసారి విచారణకు పిలిచినపుడు ఎమ్మెల్సీ కేసీఆర్ బిడ్డ ‘‘తెలంగాణ తలవంచదు’’ అంటూ ట్వీట్‌‌‌‌ చేశారు. అసలు ఢిల్లీ దొంగ సారా  దందాకు,  తెలంగాణ సమాజానికి సంబంధం ఏమిటి? కల్వకుంట్ల కుటుంబానికి ఆపద వచ్చినప్పుడల్లా దాన్ని తెలంగాణ సమాజానికి ఆపాదించడం, రెచ్చగొట్టి లబ్ధి పొందడం అలవాటుగా మారింది. తెలంగాణ సెంటిమెంట్‌‌‌‌ను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడమంత నీచమైన పని మరొకటి ఉండదు. ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో విచారణను ఎదుర్కొంటున్న కవిత..‘‘తెలంగాణ తలవంచదు’’అంటూ సుద్దులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. నిజమే తెలంగాణ ఎవరికీ తలవంచదు. మోసం చేసి ఓట్లు దండుకుని రాజ్యమేలుతున్న కేసీఆర్ సర్కార్ కు ఇక తలవంచదు. తన కుటుంబం కోసం చదువును, పరీక్షలను, ఉద్యోగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి తెలంగాణ విద్యార్థుల, యువకుల బంగారు భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్న కేసీఆర్ మెడలు వంచేందుకు తెలంగాణ సమాజం సిద్ధమైంది.  అందులో భాగంగా టీఎస్​పీఎస్సీ లీకేజీకి నిరసనగా 30 లక్షల మంది నిరుద్యోగుల, వారి కుటుంబాల తరపున ‘‘మా నౌకరీలు మాగ్గావాలే’’ నినాదంతో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపడుతున్న ‘‘నిరుద్యోగుల మహాధర్నా’’కు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నా.

ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం

కేసీఆర్ కుటుంబంలో అధికార గర్వం కనిపిస్తోంది. ప్రశ్నించే వారిని సహించలేకపోతోంది. ప్రజా నిరసనలకు కేంద్ర బిందువైన ధర్నా చౌక్‌‌‌‌ రద్దు నుంచి నిన్న వీ6, వెలుగు పత్రికలపై విషం చిమ్మడం, ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతున్న తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ వంటి సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం వరకు చూస్తే తమను ఎవరు ప్రశ్నించకూడదనే ధోరణి కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కనిపిస్తోంది. పాలకుల తప్పులను ప్రశ్నించే వారి హక్కులను కేవలం నియంతలు మాత్రమే కట్టడి చేయగలరు. తమ కుటుంబం చెప్పినట్టుగానే తెలంగాణ సమాజమంతా ఉండాలనే నియంతృత్వ నైజం కేసీఆర్‌‌‌‌ సొంతం. ఆర్టీసీ కార్మికుల సమ్మె, వివిధ తరగతుల ఉద్యోగుల ఆందోళనల సమయంలోనూ ఈ ప్రభుత్వం అనుసరించిన తీరే ఇందుకు నిదర్శనం.
- బండి సంజయ్ కుమార్, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు