- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల్ల నేతన్నల హర్షం
- ఎస్ హెచ్ జీ మహిళలకు ఏడాదికి రెండు చీరలు
- చీరల నాణ్యత, డిజైన్ల ఎంపికపై నిఫ్టికి బాధ్యతలు
- త్వరలోనే కోటి 30 లక్షల చీరల తయారీకి ఆర్డర్
రాజన్నసిరిసిల్ల, వెలుగు : తెలంగాణ ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రెండు చీరలు అందించేందుకు నిర్ణయించగా.. ఇక సిరిసిల్ల నేతన్నలకు ఏడాదంతా ఉపాధి లభించనుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త చీరలకు ఆర్డర్ లు ఇస్తానమనే ప్రకటన చేయడంతో నేతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని స్వయం సహా యక సంఘాల్లోని 63 లక్షల మంది మహిళలకు ఏడాదికి ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున1.26 కోట్ల చీరలను అందించనుంది. రాష్ట్రంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (ఎస్ హెచ్ జీ) మహిళలకు పంపిణీ చేసే చీరల నాణ్యత, డిజైన్ ఎలా ఉండాలనే దానిపై కొత్త డిజైన్లు రూపొందించే బాధ్యతను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్టికి) అప్పగించింది. త్వరలోనే నిఫ్టి చీరల డిజైన్లను చేనేత శాఖకు అంద జేయనుంది. నాణ్యతతో కూడిన కొత్త డిజైన్లు సీఎం ఆమోదించిన తర్వాత1.30 కోట్ల చీరల తయారీకి కూడా ఆర్డర్ లు ఇవ్వనుంది.
ఆరు నెలలు మాత్రమే దొరకగా..
బతుకమ్మ చీరల ఆర్డర్ లతో ఆరు నెలలు మాత్రమే పని దొరకగా.. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల్ల నేతన్నల 5 వేల కుటుంబాలు ఏడాదంతా జీవనోపాధి పొందనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఆర్వీఎం కింద 70 లక్షల మీటర్ల స్కూల్ యూనిఫాం ఆర్డర్ లు ఇచ్చింది. దీని ద్వారా ఇప్పటికే రెండు నెలలు నేతన్నలకు పని దొరికింది. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఏడాదంతా ఉపాధికి భరోసా కలగనుంది.
రూ.150 కోట్ల బకాయిలు విడుదల
గత సర్కార్ బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయించుకుని రూ. 350 కోట్లు బకాయిలు పెట్టింది. దీంతో నేతన్నలు అప్పుల్లోకి కూరుకుపోగా.. వస్త్ర పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే తొలిసారి రూ. 50 కోట్లు, గత ఏప్రిల్ లో మరోసారి రూ. 100 కోట్లు విడుదల చేసింది. సిరిసిల్ల నేతన్నలకు పెండింగ్ బకాయిలు రెండుసార్లు రూ. 150 కోట్లు చెల్లించి నేతన్నలను ఆదుకుంది. మిగతావి కూడా విడతలవారీగా ఇస్తామని హామీ ఇచ్చింది. చేనేత కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీని రూ. 4.32 కోట్లు కూడా గత నెలలో రిలీజ్చేసింది. దీంతో కార్మికులకు ఊరట లభించింది.
బతుకమ్మ చీరలపై విమర్శలు వెల్లువెత్తగా..
గత ప్రభుత్వం 2017 నుంచి 2023 వరకు ఏడేండ్లు బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలను అందజేసింది. చీరల తయారీ ఆర్డర్ లు సిరిసిల్లకు కేటాయించింది. 25 రంగుల్లో కోటి చీరలను ఉత్పత్తి చేయించింది. క్వాలిటీ లేని చీరలు పంపిణీ చేయడంతో రాష్ట్ర మంతటా బతుకమ్మ చీరలపై మహిళల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొన్నిచోట్ల మహిళలు చీరలను తగులబెట్టిన సందర్భాలు కూడా చూశాం. దీంతో ఈసారి బతుకమ్మ చీరలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ లను నిలిపివేసింది.
చెప్పినట్టు చేస్తున్నాం
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆరు నెలలుగా సంక్షోభం ఎదుర్కొంటుంది. పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నేతన్నలకు ఏడాదంతా పని కల్పిస్తామని భరోసా ఇచ్చారు. చెప్పినట్టే తాజాగా సీఎం నిర్ణయంతో చీరల ఉత్పత్తితో సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి దొరక నుంది. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆర్థికంగా సమస్యల్లో చిక్కుకుపోగా.. ఒక్కొక్క పరిష్కరిస్తున్నాం. వస్త్ర పరిశ్రమ త్వరలోనే గాడిలో పడనుంది. మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. - ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్