భద్రాద్రికొత్తగూడెంలో వన్యప్రాణుల తాగునీటి వసతికి నిధుల కటకట!

భద్రాద్రికొత్తగూడెంలో వన్యప్రాణుల తాగునీటి వసతికి  నిధుల కటకట!
  • కేంద్రం నుంచి ఆగిన కాంపా, బయోసాట్​ ఫండ్స్​
  • రెండేండ్లుగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు పైసా ఇవ్వలే.. 
  • ముదురుతున్న ఎండలు.. మొదలైన నీటి సమస్యలు 
  • మైదాన ప్రాంతాలకు వస్తున్న అడవి జంతువులు 
  • ప్రస్తుతం జీపీ ట్యాంకర్లతో నీటిని నింపుతున్న సిబ్బంది 

భద్రాచలం, వెలుగు  : అడవుల జిల్లా భద్రాద్రికొత్తగూడెంలో వన్యప్రాణులకు తాగునీటి అవసరాలకు నిధులు కటకటగా మారాయి. కేంద్రం నుంచి కాంపా, బయోసాట్​ స్కీంల ద్వారా ​ రెండేండ్లుగా జిల్లాకు పైసా కూడా రావడం లేదు. ​ దీంతో అడవుల నుంచి దాహంతో వన్యప్రాణులు మైదాన ప్రాంతాలకు వచ్చి వేటగాళ్ల వలలో చిక్కుతున్నాయి. ప్రస్తుతం వివిధ శాఖల సాయం తీసుకుని అటవీశాఖాధికారులు అడవుల్లో తాగునీటిని కల్పిస్తున్నారు. 

నీళ్లు నింపేదుకు నానా తంటాలు..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 10,13,460 ఎకరాల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ, భద్రాచలం, కిన్నెరసాని అభయారణ్యం డివిజన్లలో కొండగొర్రెలు, దుప్పులు, నెమళ్లు, కుందేళ్లు ఇతర జంతువులు పెరుగుతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో అడవుల్లోని సాసర్​ పిట్స్, చిన్న నీటి కుంటలు వేసవికి ముందే ఎండిపోతాయి. వాటిలో నీటిని నింపితే వన్యప్రాణుల దాహార్తి తీరుతుంది. 

ఇందుకు రెండు రోజులకొకసారి అటవీ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకెళ్లి నింపుతుంటారు. ఇందు కోసం గతంలో కేంద్రం కాంపా, బయోసాట్​ పేరిట నిధులు ఇచ్చేది. రెండేండ్లుగా ఇవ్వడం లేదు. గత సంవత్సరంలో జిల్లాలోని అడవుల్లో రూ.2.30కోట్ల నిధులతో 11 చెక్​డ్యాంలు, 45 సాసర్​ పిట్స్, 38 నీటి గుంటలు, 42 చిన్న నీటి గుంటలు వన్యప్రాణులకు తాగునీటి వసతి కోసం నిర్మించారు. రాబోయే మార్చి, ఏప్రిల్, మే మూడు నెలలు కూడా అటవీశాఖకు చాలా కీలకమైనవి. తప్పనిసరిగా అడవుల్లో నీటివనరులను కల్పించాల్సి ఉంటుంది. నిధుల కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. 

పంచాయతీ ట్రాక్టర్లే దిక్కు... 

అడవులకు సమీపంలో ఉన్న గ్రామపంచాయతీ ట్రాక్టర్లే అటవీశాఖకు దిక్కయ్యాయి. గత సంవత్సరం లోకల్​ ఆఫీసర్లను పట్టుకుని సాసర్​పిట్స్, నీటికుంటల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపారు. ఈ ఏడాది కూడా ఇదే తరహాలో వారి సాయం కోసం జిల్లా అధికారులకు లేఖలు రాశారు. ట్రాక్టర్లు ఇచ్చినా, డీజిల్​ కొట్టించుకుని వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు యాక్షన్​ ప్లాన్​చేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తే ఈ కష్టాలు ఉండేవి కాదు. అందుకే ప్రత్యామ్నయ ఏర్పాట్లలో అటవీశాఖ నిమగ్నమైంది.

వేటగాళ్ల ముప్పు!

వేసవిలో వేటగాళ్లు వన్యప్రాణులపై కన్నేస్తారు. అడవుల్లో తాగునీటి వసతి లేకపోతే మైదాన ప్రాంతాలను అవి ఎంచుకుంటాయి. రాత్రి వేళల్లో అడవుల నుంచి సమీపంలోని వాగులు, గోదావరి నది వద్దకు వస్తాయి. ఇదే అదనుగా వేటగాళ్లు ఈ ప్రాంతాల్లో వన్యప్రాణులను ఉచ్చులతో పట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల కుక్కల దాడుల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఇలాంటి కేసులు జిల్లాలో తరుచూ జరుగుతూనే ఉన్నాయి. వాటికి లోపల తాగునీటి వసతి ఉంటే వనం విడిచి బయటకు రావు.

నిధుల కొరత వాస్తవమే.. 

నిధుల కొరత మాట వాస్తవమే. రెండేండ్లుగా ఫండ్స్​ రావట్లేదు. అయినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా అధికారుల సహకారంతో ట్యాంకర్లతో సాసర్​ పిట్స్, నీటి కుంటలను నీటితో నింపుతున్నాం. నిధుల కోసం నివేదికలు పంపించాం. వన్యప్రాణుల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 

బాబు, డిప్యూటీ కన్జర్వేటర్​ ఆఫ్​ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్​