చనిపోయిన బర్రెలతో పీసీబీ ఆఫీసు ముందు ధర్నా

పంజాగుట్ట, వెలుగు : ఫ్యాక్టరీల నుంచి విడుదలైన కాలుష్య వ్యర్థాలు చెరువులు, కుంటల్లోకి చేరుతుండగా.. ఆ నీటిని తాగిన పశువులు చనిపోతున్నాయని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డి పోతారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. లక్షల రూపాయల విలువచేసే బర్రెలు మృతి చెందుతున్నా పరిశ్రమల యజమానులు, అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. గడ్డిపోతారం పంచాయతీ పరిధి కృష్టయ్యపల్లికి చెందిన బాశెట్టిగారి సాయికిరణ్​కు చెందిన 10 బర్రెల్లో 7 మృతి చెందాయి. మరో మూడు తీవ్ర అస్వస్థత పాలయ్యాయి.

దీంతో చనిపోయిన బర్రెలతో బుధవారం సనత్​నగర్​కాలుష్య నియంత్రణ మండలి ఆఫీసు ముందు ధర్నా చేపట్టారు. పరిశ్రమల కాలుష్య వ్యర్థాలు చెరువుల్లో, కుంటల్లో చేరుతున్నా అధికారులు పట్టించుకోలేదని మాజీ సర్పంచ్​పులిగెల  ప్రకాష్​చారి ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులు కిడ్నీలు, స్త్రీలు గర్భసంచులను కూడా కోల్పోతున్నారని ఆందోళన చెందారు. ఇప్పటి వరకు 30 లక్షల విలువైన బర్రెలు చనిపోయాయని, తమకు న్యాయం చేయాలని పీసీబీ మెంబర్​సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు.