- ప్రతిష్టాత్మకంగా అవార్డుల పంపిణీ కార్యక్రమం: డిప్యూటీ సీఎం భట్టి
- రూల్స్, లోగో, గైడ్ లైన్స్ పై రిపోర్ట్ ఇవ్వాలని కమిటీకి సూచన
హైదరాబాద్, వెలుగు: ఉగాది పండుగ నుంచి గద్దర్ అవార్డులు అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకు సంబంధించి కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు పూర్తిచేసుకోవాలని ఆయన సూచించారు. శనివారం సెక్రటేరియెట్ లో డిప్యూటీ సీఎం అధ్యక్షతన గద్దర్ అవార్డుల కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు అవార్డ్స్ కమిటీ చైర్మన్ నర్సింగరావు, ఎఫ్ డీ సీ చైర్మన్ దిల్ రాజు, ఎండీ హరీశ్, ఈడీ కిశోర్ బాబు, సాంస్కతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల, కమిటీ సభ్యులు వందేమాతరం శ్రీనివాస్, జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ్, హరీశ్ శంకర్, గుమ్మడి వెన్నెల, అల్లాణి శ్రీధర్, వేణు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు. అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ నిబంధనలు, ఎన్ని కేటగిరీల్లో అవార్డులు ఇవ్వాలి, క్యాష్ ప్రైజ్ ఎంత అన్న విషయాలపై సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని డిప్యూటీ సీఎం కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. జాతీయస్థాయి కార్యక్రమాల తరహాలోనే నిర్వహించాలని డిప్యూటీ సీఎం సూచించారు. కల్చరల్ ఐకాన్ గద్దర్ ను గుర్తు చేసేలా అవార్డుల లోగోలు రూపొందించాలని డిప్యూటీ సీఎం తెలిపారు.