న్యూఢిల్లీ: జాతీయ రహదారుల వెంబడి అనేక సౌకర్యాలు కల్పించేందుకు హమ్‌సఫర్ విధానాన్ని కేంద్ర రోడ్డురవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. హైవేలపై క్లీన్ టాయిలెట్లు, బేబీ కేర్ రూమ్‌లు, వీల్చెయిర్ల వంటి అవసరమైన సౌకర్యాలను అందిస్తారు. అంతేగాక ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, పార్కింగ్ స్థలాలు, బంకుల్లో డార్మిటరీ సేవలు వంటి సౌకర్యాలను ప్రవేశపెడతామని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విధానం హైవే వినియోగదారులకు అనుకూలమైన, సంతోషకరమైన అనుభవాన్ని అందిస్తుందని పేర్కొంది.
ఈ పాలసీ వల్ల భారీగా ఉపాధి కల్పన కూడా సాధ్యపడుతుందని వివరించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి గడ్కరీ ప్రసంగిస్తూ, హమ్‌సఫర్ బ్రాండ్ దేశంలోని ప్రపంచ స్థాయి హైవే నెట్‌వర్క్‌లో ప్రయాణికులకు, డ్రైవర్లకు అత్యంత భద్రత, సౌకర్యానికి పర్యాయపదంగా మారుతుందని అన్నారు. జాతీయ రహదారుల అంతటా అధిక నాణ్యత గల సేవలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.