కర్ణాటక మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆయన..సొంతంగా పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. బెంగళూరులోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి.. బీజేపీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నూతన పార్టీ ద్వారా కన్నడ రాజకీయాల్లో సెకండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టనున్నట్లు గాలిజనార్థన్ రెడ్డి పేర్కొన్నారు.
పోటీ చేస్తాం...
బీజేపీతో తన బంధం ముగిసిందని గాలి జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నాటక అభివృద్ధే తన లక్ష్యంగా పార్టీని స్థాపిస్తున్నట్లు గాలిజనార్థన్ రెడ్డి తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగుతానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పల్లెకు చేరుకునేలా పార్టీని నిర్మిస్తామన్నారు. కల్యాణ రాజ్యప్రగతి పక్ష పార్టీ కర్ణాటక ప్రజల హృదయాలను గెలుచుకుంటుందన్న విశ్వాసం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఏయే నియోజకవర్గాల్లో పోటీచేస్తుందో త్వరలో వివరాలను వెల్లడిస్తామన్నారు. అంతేకాదు మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తామని గాలి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో తాను గంగావతి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.
బీజేపీపై విమర్శలు..
కర్ణాటక రాజకీయాల్లో తన వాళ్లు అనుకున్న వారే తనను మోసం చేశారని గాలి జనార్థన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో తనకు ఎవరూ అండగా నిలబడలేదన్నారు. మాజీ సీఎం యడ్యూరప్ప, జగదీష్ షెట్టర్ తప్ప ఎవరూ కూడా తన ఇంటికి రాలేదన్నారు. వారిని ఎప్పుడు గుర్తుంచుకుంటానని స్పష్టం చేశారు. అటు బీజేపీ మంత్రి శ్రీరాములుతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. శ్రీరాములు తనకు చిన్ననాటి స్నేహితుడని చెప్పారు.
ఆంక్షలతో బెయిల్..
అక్రమ మైనింగ్ వ్యవహారంలో జైలుకెళ్లిన గాలి జనార్థన్ రెడ్డి... 2015లో బెయిల్ పై విడుదలయ్యారు. కొన్ని ఆంక్షల నడుమ సుప్రీంకోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. పాస్‌పోర్టులను అప్పగించాలని.. తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. అటు బళ్లారి, అనంతపురం, కడప కూడా వెళ్లొద్దని స్పష్టం చేసింది. అయితే బళ్లారిలో తన కుమార్తెను కలిసేందుకు అనుమతి ఇవ్వాలన్న గాలి జనార్దన్‌రెడ్డి అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. దీంతో కుమార్తె వద్దకు వెళ్లిన ఆయన నవంబరు 6 వరకు అక్కడే గడిపారు. ప్రస్తుతం బీజేపీకి రాజీనామా చేసిన గాలి జనార్థన్ రెడ్డి..కొత్త పార్టీని ఏర్పాటు చేయడం..కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఎలక్షన్ హీట్ స్టార్ట్..
కర్ణాటకలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మరో ఆరు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుండటంతో... ఆ లోగా ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. దీంతో ఆ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారాన్ని ఛేజిక్కించుకునేందుకు పక్కా వ్యూహాలతో సన్నద్దమవుతోంది. అటు జేడీఎస్ ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమైనట్లు ప్రకటించింది. మాజీ సీఎం కుమార స్వామి 93 మంది అభ్యర్థులతో మొదటి జాబితా కూడా ప్రకటించారు. తాజాగా గాలిజనార్థన్ రెడ్డి ఎన్నికల సీన్లోకి రావడంతో..ఈ సారి కన్నడ రాజకీయం రసవత్తరగా మారనుంది.