Success: గాంధార శిల్పకళ

గాంధార శిల్పకళ ఇండో–గ్రీకుల పరిపాలనలో ఆవిర్భవించింది. శకులు, కుషానులు ఈ కళను ఎక్కువగా పోషించారు. ఇది వాయవ్య భారతదేశంలో ముఖ్యంగా పెషావర్ చుట్టూ కనిపించిన శిల్పకళ. గ్రీకు, భారతీయ, రోమ్ శిల్ప కళారీతుల సమ్మేళనమే గాంధార శిల్పకళా శైలి. కాబట్టి ఈ కళను ఇండో–గ్రీకు శిల్పకళ అంటారు. గాంధార శిల్పికి శిల్పాలు చెక్కడంలో గ్రీకు హస్తం, భారతీయ హృదయం ఉండటం విశేషంగా చెబుతారు. ఈ శైలిలో బుద్ధుని విగ్రహాలు, బుద్ధుని జీవితానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలు ప్రధాన పోత్ర పోషిస్తాయి. ఈ శైలిలో మొదటి దశలో గ్రీకు ప్రభావాన్ని, చివరి దశలో రోమన్ ప్రభావాన్ని గమనించవచ్చు. ఇది మహాయాన బౌద్ధమత అభివృద్ధికి పాటుపడింది. 

లక్షణాలు
    

 

  •  ఈ శిల్పకళ కేవలం బౌద్ధ మతానికి మాత్రమే సంబంధించింది. ఈ శైలిలో విస్తారంగా నల్లరాయి వినియోగించారు.     
  •  గాంధార శిల్పంలో బుద్ధుని ముఖ్య లక్షణాల్లో గ్రీకు ప్రభావం ప్రధానంగా కనిపిస్తుంది.  
  •  ఈ శైలిలో మలిచిన బోధిసత్వుని విగ్రహాల్లో ప్రధానమైంది బోధిసత్వ మైత్రేయ, బోధిసత్వ అవలోకితేశ్వర, బోధిసత్వ పద్మపాణి
  •  ఈ కళలో ఆధ్యాత్మికత కంటే శారీరక సౌందర్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఉదా: రింగుల జుట్టు, బలమైన, పుష్టిగల కండలు, అందమైన శరీరాకృతి.