
మందమర్రి మండలం బొక్కలగుట్ట సమీపంలోని గాంధారి ఖిల్లా ప్రాంతం శనివారం భక్తజనంతో కిక్కిరిసింది. సదర్ల భీమన్న దేవతామూర్తులను శోభాయాత్రగా జీడికోటకు తీసుకురావడంతో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. లక్ష్మిదేవర, తప్పెటగుళ్ల నృత్యాలతో నాయక్ పోడ్ కళాకారులు తమ సంస్కృతి, సంప్రదాయాలను చాటుకున్నారు. నాయక్ పోడ్మహిళలు ఖిల్లా దిగువభాగంలోని మేడిచెరువు ఊట వద్ద పూజలు చేసి కుండల్లో గంగాజలాన్ని తీసుకొని గుట్టపై ఉన్న ఖిల్లా ప్రాంతానికి చేరుకున్నారు.
కాలభైరవుడు, పెద్ద దర్వాజ వద్ద కొలువైన గాంధారి మైసమ్మ తల్లి, నాగశేషుడు, సదర్ల భీమన్న దేవతామూర్తులకు గిరిజన సంప్రదాయ పద్ధతిలో గంగాజలంతో అభిషేకించి పూజలు చేశారు. సాయంత్రం ఉట్నూరు ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా దేవతామూర్తులకు పూజలు చేశారు. ఆదివారం తెల్లవారుజామున మైసమ్మకు పట్నాలతో పూజలు చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని నాయక్ పోడ్ కులపెద్దలు తెలిపారు. ఖిల్లా దిగువ భాగంలో దర్బార్ నిర్వహించనున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జాతరకు హాజరు కానున్నారు. - కోల్ బెల్ట్/లక్సెట్టిపేట, వెలుగు