మార్చురీ కంపును భరించలేక పోతున్నం

మార్చురీ కంపును భరించలేక పోతున్నం
  • గాంధీ హాస్పిటల్ ​పరిసరాల ప్రజలు ఆందోళన

పద్మారావునగర్, వెలుగు : గాంధీ హాస్పిటల్​మార్చురీ నుంచి వస్తున్న కంపును భరించలేకపోతున్నామని, ఇండ్లల్లో ఉండలేకపోతున్నామని పద్మారావునగర్, అభినవ్ నగర్​కాలనీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అభినవ్​నగర్ కాలనీ రెసిడెంట్స్​వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్​ రాజేశ్ గౌడ్, ప్రతినిధి చంద్రపాల్ రెడ్డి గురువారం గాంధీ హాస్పిటల్​డిప్యూటీ సూపరింటెండెంట్​ప్రొ.డా.వినయ్ శేఖర్​కు వినతి పత్రం సమర్పించారు. 2004లో గాంధీ ఆసుపత్రి నిర్మించగా, అంతకు ముందు నుంచే గాంధీ పరిసరాల ప్రాంతాల్లో కాలనీలు ఉన్నాయన్నారు. కెపాసిటీకి మించి డెడ్ బాడీలను మార్చురీలో ఉంచుతున్నారని ఆరోపించారు. మార్చురీలోని సగం ఫ్రీజర్లు పనిచేయడం లేదని చెప్పారు. ఫలితంగా డెడ్​బాడీల నుంచి భరించలేని కంపు వ్యాపిస్తోందని, ఇంట్లో భోజనం కూడా చేయలేకపోతున్నామని వాపోయారు. 

ఈ విషయమై గాంధీ సూపరింటెండెంట్​ ప్రొ.రాజారావు మాట్లాడుతూ.. మార్చురీలో ప్రస్తుతం 59 బాడీ ఫ్రీజర్లు ఉన్నాయని, ఇందులో కేవలం 25 మాత్రమే నిత్యం వాడుతుంటామని చెప్పారు.  మిగిలినవి ఖాళీగానే ఉంటాయన్నారు. 8 ఫ్రీజర్లు రిపేరులో ఉన్నాయన్నారు. పోస్టుమార్టం కోసం వచ్చే డెడ్​బాడీలతో సమస్య లేదన్నారు. పోలీసులు తీసుకొచ్చే గుర్తుతెలియని డెడ్​ బాడీలను కచ్చితంగా మూడు రోజుల పాటు మార్చురీలో భద్రపరచాలన్న నిబంధన ఉందని చెప్పారు. ఈ క్రమంలో అవి కుళ్లిపోయి దుర్వాసన వస్తుందన్నారు. గుర్తుతెలియని డెడ్​ బాడీలను గాంధీకి కాకుండా సిటీ శివారులో ప్రత్యేక మార్చురీ ఏర్పాటు చేసి, అక్కడ ఉంచాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ  జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.