హాంగ్జౌ: ఇండియా డబుల్స్ షట్లర్లు ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో బోణీ చేశారు. గురువారం జరిగిన విమెన్స్ డబుల్స్ గ్రూప్–ఎ రెండో మ్యాచ్‌లో ట్రీసా–గాయత్రి 21–19, 21–19తో మలేసియా ద్వయం పియర్లీ టాన్–తిన్హా మురళీధరన్‌పై గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకున్నారు.
ఇక పియర్లీ–తిన్హాతో 46 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ట్రీసా–గాయత్రికి గట్టి పోటీ ఎదురైంది. 6–2తో తొలి గేమ్‌ను మొదలుపెట్టినా.. మలేసియా జంట వరుస పాయింట్లతో దూసుకొచ్చింది. దీంతో ప్రతి పాయింట్ కోసం హోరాహోరీ పోరాటం జరిగింది. చివర్లో రెండు బలమైన స్మాష్‌లతో ట్రీసా ద్వయం గేమ్ నెగ్గింది. రెండో గేమ్ కూడా తొలి ఐదు పాయింట్ల వరకు నువ్వానేనా అన్నట్లుగా సాగింది. తర్వాత పియర్లీ–తిన్హా కొద్దిగా ఆధిక్యంలోకి వెళ్లినా.. క్రాస్ కోర్టు విన్నర్లతో గాయత్రి–ట్రీసా 19–19తో స్కోరు సమం చేశారు. అదే క్రమంలో రెండు ర్యాలీలతో గేమ్, మ్యాచ్‌ను చేజిక్కించుకున్నారు.