భూదాన బోర్డుపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా: జి. చిన్నారెడ్డి

భూదాన బోర్డుపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా: జి. చిన్నారెడ్డి
  • రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నా రెడ్డి

బషీర్ బాగ్, వెలుగు :  భూదాన యజ్ఞ బోర్డుకు చెందిన అన్యాక్రాంతమైన భూములను తిరిగి అప్పగించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి తెలిపారు. భూదాన ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, ఉద్యమ అమరల చరిత్రను పాఠ్యాంశాల్లో పొందు పర్చడం, ట్యాంక్ బండ్ పై లేదా ఇతర ముఖ్యమైన ప్రాంతంలో అమర వీరుల విగ్రహాల ఏర్పాటుపైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.

 భూదాన ఉద్యమానికి బీజం వేసిన భూదాన్ (వెదిరె) రామచంద్రా రెడ్డి 119వ జయంతి సభ బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది.  ఈ సందర్భంగా చిన్నా రెడ్డి మాట్లాడుతూ మహోన్నత లక్షంతో ఏర్పాటు చేసిన భూదాన యజ్ఞ బోర్డును పునర్ నిర్మిస్తే.. ఎంతో మంది పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. 

ప్రజాసేవే లక్ష్యంగా పని చేసిన తెలంగాణ సాయుధ పోరాటం,  భూదాన ఉద్యమం,  రాష్ట్ర సాధన ఉద్యమ అమరుల వారసులు రాజకీయాల్లోకి రావాలని, తద్వారా ప్రజలకు మరింత సేవ చేయడంతో పాటు నీతి, నిజాయతీ, విలువలతో కూడిన రాజకీయాలను ప్రొత్సహించవచ్చని ఆయన కోఆరు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చొరవతీసుకుని నల్లగొండ జిల్లాలోని పలు గ్రామాల్లో బెల్టు షాప్ లను తొలగింపజేయడం అభినందనీయన్నారు.

రామచంద్రా రెడ్డి మెమోరియల్ ట్రస్ట్  ట్రస్టీ వెదిరె ప్రభోద్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎ.నరసిం హారెడ్డి, తెలంగాణ భాషా, సాంస్కృతిక మండలి చైర్మన్ గంటా జలంధర్ రెడ్డి, ఆలిండియా సర్వసేవా సంఘ్ మేనేజింగ్ టస్ట్రీ మహదేవ్ విద్రోహి, అఖిల భారత సర్వసేవ సంఘ్ జాతీయ అధ్యక్షుడు వెదిరె అరవింద్ రెడ్డి, కార్యదర్శి ఎ.రవీంద్రాచారి, రాష్ట్ర కన్వీనర్ టి.కృష్ణా గౌడ్,  అతిథులుగా అమరవీరుల వారసులు భీంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మల్లు కరుణ, ఆరుట్ల శ్రీకాంత్, చిట్యాల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.