ప్రభుత్వ జీవోకు అనుగుణంగా అధికారుల నిర్ణయం
స్పెషల్ డెవలప్మెంట్ చార్జీల కింద ఫీజులు వసూలు
వచ్చే ఆదాయం అప్పులు తీర్చేందుకు, ప్రాజెక్టులకు కేటాయింపు
హైదరాబాద్, వెలుగు : ఆదాయంపై బల్దియా దృష్టి పెట్టింది. సిటీలో చేపట్టిన ప్రాజెక్టుల పూర్తికి , చేసిన అప్పులు తీర్చేందుకు స్పెషల్ డెవలప్ మెంట్చార్జీలను వేయాలని నిర్ణయించింది. సిటీలోని 118 రోడ్లను కమర్షియల్ గా మార్చుతూ అధికారులు ప్రకటించారు. కమర్షియల్ రోడ్ల సంఖ్యను పెంచుతూ సోమవారం ప్రభుత్వం జీవో 102 విడుదల చేసింది. ఆయా రోడ్లకు ఇరువైపులా నిర్మించే కమర్షియల్ నిర్మాణాల ద్వారా ఫీజుల ద్వారా ఆదాయం రాబట్టుకునేందుకు అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా ఇక్కడ చేసే నిర్మాణాల ద్వారా బల్దియాకు ఇంపాక్ట్ రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని బల్దియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు 66 కమర్షియల్ రోడ్లు ఉండగా, ప్రస్తు తం పెంచిన వాటితో కలిపి184 రోడ్లలో కమర్షియల్ యాక్టివిటీస్నుపెంచేందుకు వీలవుతుంది. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ట్రేడ్లైసెన్స్ ఫీజు రూపంలో వచ్చే ఆదాయం కూడా బల్దియాకు పెరుగుతుంది. సిటీలో మెయిన్అనుసంధానంగా ఉన్న రోడ్లతో పాటు ఇటీవల ఏర్పాటు చేసిన లింక్ రోడ్లలో కొన్నింటిని కూడా కమర్షియల్ రోడ్లుగా గుర్తించారు.
ఇంపాక్ట్ చార్జీల కింద..
వాణిజ్య రహదారుల పరిధిలోకి వచ్చే మల్టీప్లెక్స్ లు, సినిమా థియేటర్లు, వాణిజ్య భవనాలు, మాల్స్, షోరూంలు, హోటల్స్, పబ్స్, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్, ఆఫీస్ కాంప్లెక్స్ లు, ఆఫీస్ కమర్షియల్ కలిపి ఉన్న భవనాలు, ఐటీ, ఐటీఈఎన్ కాంప్లెక్స్, హోటల్, మార్కెట్లు, పెట్రోల్ బంక్ లు, మోటార్ రిపేర్గ్యారేజీలు ఇక మీదట మొదటి అంతస్తు వరకు ఇంపాక్ట్ చార్జీల కింద సబ్ రిజిస్ట్రార్ ప్రకారం మార్కెట్ విలువలో 6 శాతం లేక చదరపు అడుగుకు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా బహుళ అంతస్తులకు సంబంధించి మార్కెట్ విలువలో 3 శాతం లేక చదరపు అడుగుకు రూ.150 చొప్పున ఏది ఎక్కువైతే అది వనూలు చేస్తారు. ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, విద్యాసంస్థ లు, ఔట్లెట్స్,కిరాణ, మెడికల్ షాపులు, మిల్క్ సెంటర్లు తదితరాలకు సంబంధించి 500 చదరపు అడుగుల లోపు ఉండి మొదటి అంతస్తులో ఉన్న నిర్మాణాలకు 2 శాతం లేక చదరపు అడుగుకు రూ. 100, బహుళ అంతస్తులకు సంబంధించి 1 శాతం లేక చదరపు అడుగుకు రూ.10 ఏది ఎక్కువైతే ఆ చార్జీలు చెల్లించాల్సి ఉం టుంది. వాహనాల పార్కింగ్ కు సంబంధించి పలు సూచనలు చేశారు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సిటీలో చేపడుతున్న ప్రాజెక్టులకు ఉపయోగించాలని నిర్ణయించారు. ప్రధానంగా కమర్షియల్ రోడ్ల వద్ద వచ్చే ఆదాయంతో నాలాల డెవలప్మెంట్కు ఖర్చు చేయాలని అధికారులు నిర్ణయించారు. హెచ్ఎండీఏ పరిధిలోని కోకాపేట్, పుప్పల్ గూడ, ఓయూ కాలనీలో ఒక్కోటి చొప్పున రోడ్లను కమర్షియల్ గా గుర్తించారు.
సర్కిళ్ల వారీ కమర్షియల్ గా మారిన కొత్త రోడ్లు ఇవే..
కాప్రా – 5, హయత్నగర్– 2, ఎల్బీనగర్ – 8, మలక్ పేట్– 1, చార్మినార్ – 4, ఫలక్ నుమా – 2, మెహిదీ పట్నం – 14, కార్వాన్ – 5, గోషా మహల్ – 1 , ముషీరాబాద్ – 5, అమీర్ పేట్ – 2, ఖైరతాబాద్ – 6, జూబ్లీ హిల్స్ – 9, శేరిలింగంపల్లి – 12, చందానగర్ – 4, పటాన్ చెరు – 3, మూసాపేట్ – 10, కూకట్ పల్లి – 7, అల్వాల్ – 8, మల్కాజ్గిరి– 2, సికింద్రాబాద్ – 2, గాజుల రామారం – 3.
-----