
- రూ.600 కోట్లతో 6 కి.మీ. మేర 100 అడుగుల రోడ్డుకు ప్రతిపాదన
- మధ్యలో రెండు ఫ్లై ఓవర్లు కూడా..36 ఎకరాల డిఫెన్స్ భూమి అవసరం
- ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలంటూ కలెక్టర్లకు జీహెచ్ఎంసీ బాస్ లెటర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: మారేడ్పల్లి, సికింద్రాబాద్మీదుగా సికింద్రాబాద్ ఏఓసీ(ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్) సెంటర్ కు వెళ్లకుండా మల్కాజిగిరి, ఈసీఐఎల్, సఫిల్ గూడ, ఆర్కే పురం వెళ్లేందుకు ప్రత్యామ్నాయ రోడ్లు నిర్మించడానికి జీహెచ్ఎంసీ ప్లాన్చేస్తోంది. ఈ పనుల్లో స్పీడ్పెంచింది. మారేడ్పల్లి చౌరస్తా దాటిన తర్వాత సుమారు రూ.600 కోట్లతో 6 కిలోమీటర్ల మేర ఆర్కే పురం వరకు 100 అడుగుల రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే ప్రపోజల్స్ రెడీ చేసింది. ఇందులో రెండు చోట్ల ఫ్లై ఓవర్లు కూడా ఉన్నాయి.
వీటి నిర్మాణానికి 36 ఎకరాల డిఫెన్స్ భూమి అవసరమవుతుందని జీహెచ్ఎంసీ అంచనా వేయగా, బదులుగా ప్రభుత్వ భూమిని అప్పగించాల్సి ఉంటుంది. అయితే భూమి ఎక్కడ ఖాళీగా ఉందన్న అంశంపై బల్దియా కమిషనర్ ఇలంబరితి దృష్టి పెట్టారు. అందుబాటులో ఉన్న భూమిని గుర్తించాలని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి కలెక్టర్లకు లెటర్లు రాయనున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరగా లైన్ క్లియర్ అయ్యేలా చూడనున్నారు. ఈ విషయమై ఇప్పటికే మిలటరీ అధికారులతో కమిషనర్ సమావేశమై మాట్లాడారు. భూమిని అప్పగించిన వెంటనే ఫ్లైఓవర్ల పనులు మొదలుపెట్టనున్నారు.
ఇక ట్రాఫిక్ ఆంక్షలు ఉండవు..
మారేడ్పల్లి నుంచి ఏఓసీ, మిలటరీ హాస్పిటల్ప్రాంతాల నుంచి వెళ్లే రోడ్లకు ప్రత్యమ్నాయంగా మారేడ్ పల్లి, సఫిల్ గూడ, ఆర్కే పురం గుండా రోడ్లు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. పెరుగుతున్న వాహనాలు, రద్దీతో నిత్యం మిలటరీ ఏరియాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.
ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ రోడ్లపై నుంచి రాకపోకలను ఆపేస్తున్నారు. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బల్దియా నిర్మించాలనుకుంటున్న రోడ్డు నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్ నుంచి మల్కాజిగిరి, నేరెడ్ మెట్, ఈసీఐఎల్ వెళ్లేవారికి తిప్పలు తప్పుతాయి. తక్కువ సమయంలోనే ఏఓసీ సెంటర్ కు వెళ్లకుండా బయటి నుంచే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
ఆర్కేపురం వద్ద ఆర్ఓబీ, ఆర్ యూబీ
మిలటరీ ఏరియాలో నిర్మించే ఈ రోడ్డుకు కనెక్టింగ్ గా ఆర్కేపురం వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ), రైల్ అండర్ బ్రిడ్జి(ఆర్ యూబీ)లను బల్దియా నిర్మించనుంది. ఇరువైపుల రాకపోకలు సాగించేందుకు సమాంతరంగా వీటిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం రూ.245 కోట్లకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇందులో ఆర్ఓబీకి రూ.210 కోట్లు కాగా, ఆర్ యూబీకి రూ.35 కోట్లు ఇచ్చారు. తక్కువ ఖర్చులోనే ఈ నిర్మాణాలు పూర్తి చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. పనులు మొదలైతే ఏడాది లోపలే పూర్తి చేస్తామంటున్నారు.