వీధి కుక్కలకు 80 శాతం స్టెరిలైజేషన్‌‌ పూర్తి

వీధి కుక్కలకు 80 శాతం స్టెరిలైజేషన్‌‌ పూర్తి
  •  కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం
  •  హైకోర్టుకు జీహెచ్‌‌ఎంసీ నివేదిక 

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌‌ఎంసీ), దాని పరిసర జిల్లాల్లో వీధి కుక్కల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టినట్లు జీహెచ్‌‌ఎంసీ హైకోర్టుకు నివేదించింది. వీధి కుక్కలను గుర్తించి 80 శాతం స్టెరిలైజేషన్‌‌ పూర్తి చేశామని తెలిపింది. వీధి కుక్కల దాడి ఘటనపై పత్రికలో ప్రచురితమైన కథనాన్ని సుమోటోగా తీసుకుని విచారణ కోర్టు చేపట్టింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ సుజయ్‌‌ పాల్, జస్టిస్‌‌ రేణుక యారాల బెంచ్‌‌ బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. 

హైకోర్టు ఆదేశాలతో జీహెచ్‌‌ఎంసీ నివేదిక దాఖలు చేసిందని ప్రభుత్వ న్యాయవాది చెప్పింది. అనంతరం విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. 2022 నుంచి 2024 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3.34 లక్షల కుక్కకాటు సంఘటనలు చోటుచేసుకున్నాయని, ఇందులో జీహెచ్‌‌ఎంసీ, పరిసర జిల్లాల్లో 1.10 లక్షలు ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 36 మంది కుక్కకాటు వల్ల చనిపోయినట్లు అనుమానంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, అవగాహన, సంక్షేమ కార్యక్రామలకు 2022– -23 నుంచి 2024 డిసెంబరు వరకు రూ.29.67 కోట్లు కేటాయించగా, రూ.9.21 కోట్లు ఖర్చు అయిందన్నారు. 

వీధి కుక్కల సమాచారంతోపాటు టోల్‌‌ఫ్రీ, హెల్ప్‌‌లైన్, మైజీహెచ్‌‌ఎంసీ యాప్, వెబ్‌‌పోర్టల్, సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలిపారు. యాంటీరేబిస్‌‌ వ్యాక్సినేషన్‌‌ చేస్తున్నామని, నయం కాని వ్యాధులతో ఉన్న కుక్కలను నిబంధనల ప్రకారం చంపుతున్నామని తెలిపారు. కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని, ముఖ్యంగా పాఠశాలలు, క్రీడా మైదానాలు, మూసీ ఒడ్డున, ఆర్మీబేస్‌‌ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి స్టెరిలైజేషన్‌‌కు చర్యలు తీసుకుంటున్నామని నివేదికలో వెల్లడించారు. వీధి కుక్కలకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, కోర్టు జారీ చేసే ఉత్తర్వులను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.