- జీహెచ్ఎంసీలో నెలకు రూ.2.50 కోట్లు ఆదా
- బయోమెట్రిక్ ఆసరాగా రూ.300కోట్లు కాజేసిన అక్రమార్కులు
- 2 నెలల కింద అందుబాటులోకి వచ్చిన ఫేస్ రికగ్నిషన్
హైదరాబాద్, వెలుగు: ఫేస్‌రికగ్నిషన్ టెక్నాలజీతో బల్దియాలో ఫేక్ అటెండెన్స్ కు చెక్‌పెట్టారు. రెండు నెలల కింద వరకు కార్మికుల అటెండెన్స్ ను బయోమెట్రిక్(ఫింగర్ ప్రింట్) పద్ధతిన తీసుకున్నారు. అప్పటివరకు కొందరు అక్రమార్కులు లేని సిబ్బంది ఉన్నట్లు చూపిస్తూ.. క్లోనింగ్ చేసిన ఫింగర్‌ప్రింట్స్ తో అటెండెన్స్నమోదు చేసేవారు. అందినకాడికి జీహెచ్ఎంసీ నిధులను కాజేసేవారు. ఆ దందాను గుర్తించిన బల్దియా ఉన్నతాధికారులు బయోమెట్రిక్పద్ధతికి స్వస్తి పలికారు.
జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతున్న వారిని తొలగించి, కేసులు నమోదు చేశారు. అటెండెన్స్అక్రమాలకు చెక్‌పెడుతూ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త టెక్నాలజీతో కార్మికుల అటెండెన్స్తీసుకుంటోంది. 2014 నుంచి ఈ ఏడాది మార్చి వరకు కార్మికుల జీతాల కోసం జీహెచ్ఎంసీ నెలకు దాదాపు రూ.33.5 కోట్లు చెల్లించేది. ఫేషియల్ రికగ్నిషన్ అందుబాటులోకి వచ్చాక ఆ మొత్తం రూ.31 కోట్లకు తగ్గింది.
ఈ ప్రకారం చూస్తే నెలకు రూ.2.5 కోట్ల చొప్పున గడిచిన పదేండ్లలో దాదాపు రూ.300 కోట్లను అక్రమార్కులు కాజేశారు. గతంలో ఫింగర్ ప్రింట్ అటెండెన్స్ కోసం జీహెచ్ఎంసీ ఏడాదికి రూ.కోటి92లక్షల54వేల360 ఖర్చు చేయగా, ప్రస్తుతం ఫేషియల్ రికగ్నిషన్ కోసం రూ.67లక్షల8వేలు ఖర్చు చేస్తోంది.
కొత్త టెక్నాలజీతో ఎంతో మేలు
ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ తో బల్దియాకి ఎంతో మేలు జరుగుతోంది. పైలెట్ ప్రాజెక్టు కింద కార్వాన్ సర్కిల్లో మొదట అమలుచేశారు. తర్వాత గ్రేటర్ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31వరకు ఫింగర్ ప్రింట్ అటెండెన్స్ అమలులో ఉంది. అప్పటివరకు మొత్తం 21,716 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు చూపించారు. ఇందులో ఎస్ఎఫ్ఏలు 953 మంది, శానిటేషన్ వర్కర్లు 17,899 మంది, ఎంటమాలజీ ఈఎఫ్ఏలు 133 మంది, ఎంటమాలజీ వర్కర్లు 2,336, వెటర్నరీకి సంబంధించి సిబ్బంది 395 మంది ఉన్నారు.
ఫేషియల్ రికగ్నిషన్ అందుబాటులోకి వచ్చాక ఈ నెల 18 వరకు 20,700 మంది అప్లయ్ చేసుకున్నారు. ఇందులో ఎస్ఎఫ్ఏలు 920, శానిటేషన్ వర్కర్లు 16,978 మంది, ఎంటమాలజీ ఈఎఫ్ఏలు 132, ఎంటమాలజీ వర్కర్లు 2311, వెటర్నరీకి సంబంధించి 359 మంది ఉన్నారు. ఇన్నాళ్లు లేని 1,016 మంది లేని సిబ్బందిని ఉన్నట్లు చూపించి, బల్దియా ఆదాయానికి గండికొట్టినట్లు స్పష్టమవుతోంది.
ఫేక్ ఫొటోలతో ప్రయత్నం
ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అందుబాటులోకి వచ్చాక కూడా కొందరు అక్రమార్కుల్లో మార్పు రాలేదని తెలుస్తోంది. ఇటీవల కొందరి ఫొటోలతో అటెండెన్స్ వేసేందుకు ప్రయత్నించారు. టెక్నికల్సమస్య కారణంగా లేని సిబ్బంది అటెండెన్స్ నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఈ సమస్య ఒక్కరోజు మాత్రమే వచ్చిందని, 87 మంది ఫేక్ అటెండెన్స్ వేసినట్లు అధికారులు గుర్తించారు.
సెలవుపై వెళ్లిన కమిషనర్ రోనాల్డ్ రోస్ వచ్చిన తరువాత వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. టెక్నికల్ సమస్యకు అధికారులు చెక్ పెట్టారు. జీహెచ్ఎంసీ ఐటీ అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీశ్గురువారం ముషీరాబాద్ లోని ఏవీ కాలేజీ సమీపంలో అటెండెన్స్ నమోదును పరిశీలించారు.