మండీ తిని పలువురు అస్వస్థతకు గురయ్యారనే ఆరోపణలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎస్ మండీ హోటల్‌ను మూసివేసింది. ఈ ఘటన నవంబర్ 19న హైదరాబాద్ లో చోటుచేసుకుంది. దీనిపై స్థానిక సామాజిక కార్యకర్త అజ్మత్ జాఫరీ జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేయడంతో అధికారుల బృందం వెంటనే హోటల్‌ను సందర్శించింది.
దాదాపు 45 మంది వ్యక్తులు హోటల్‌లో మండీని తిన్న, ఇంటికి పార్శిల్‌లను తీసుకెళ్లిన వారు వాంతులు వంటి ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి ఫిర్యాదు చేశారు. వారిని హైదరాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రాంగణాన్ని పరిశీలించారని, మయోనైస్, మండీ బియ్యం కలుషితమయ్యే అవకాశం ఉందని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జీహెచ్ఎంసీ అనుమానాలు వ్యక్తం చేసింది. నమూనాలను విశ్లేషణకు పంపారని, తదుపరి నోటీసు వచ్చేవరకు ప్రాంగణాన్ని మూసివేయాలని యాజమాన్యానికి సూచించింది.
పరిశుభ్రత పాటించడంలో విఫలమైనందుకు, ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినందుకు గానూ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత వ్యక్తులలో ఒకరు మిర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో హోటల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.