కూతురిని ప్రేమించిండని.. యువకుడి గొంతు కోసిండు

కూతురిని ప్రేమించిండని.. యువకుడి గొంతు కోసిండు
  • భయంతో ఉరేసుకుని విద్యార్థిని సూసైడ్  
  • హనుమకొండలోని శ్రీనివాస కాలనీలో ఘటన 
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు

హసన్ పర్తి, వెలుగు: తన కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుడిపై ఆమె తండ్రి దాడి చేసి గొంతు కోశాడు. దీంతో భయపడిన బాలిక ఇంట్లో ఉరేసుకుని చనిపోయిన ఘటన వరంగల్ సిటీలో సంచలనం సృష్టించింది.  పోలీసులు బాలిక ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా కేయూ పీఎస్ పరిధి శ్రీనివాస కాలనీకి చెందిన వెంకట రమణారెడ్డి  ఓ చిట్ ఫండ్ కంపెనీలో మేనేజర్ గా చేస్తున్నాడు. అతని కూతురు సహస్ర(17) ఇంటర్ సెకండియర్ చదువుతుంది. 

వరంగల్ పోచమ్మ మైదాన్ ఏరియాకు చెందిన బీటెక్ చదువుతున్న   భరత్(19), ఆమె  కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి  భరత్  వెళ్లాడు. ఆ సమయంలో  ఇంటికి వెళ్లిన వెంకట రమణారెడ్డికి వారిద్దరూ కనిపించడంతో  చూసి ఆగ్రహం చెందాడు. దీంతో యువకుడు పారిపోతుండగా వెంబడించి పట్టుకుని చితకబాదాడు. అనంతరం వెంకట రమణారెడ్డి కత్తితో భరత్ గొంతుపై దాడి చేసి కోశాడు. స్థానికులు యువకుడిని హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్ కు  తరలించగా చికిత్స పొందుతున్నాడు.

భయపడి బాలిక సూసైడ్

భరత్ పై తన తండ్రి దాడి చేయడం, ప్రేమ గురించి తెలియడంతో సహస్ర భయపడి ఇంట్లో చీరతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియరాలేదు. దీనిపై కాకతీయ వర్సిటీ పోలీసులను వివరణ కోరగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.