వెనుకబడిన ప్రజల క్షేమమే..రాహుల్ యాత్ర లక్ష్యం

వెనుకబడిన ప్రజల క్షేమమే..రాహుల్ యాత్ర లక్ష్యం

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జనవరి 14న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించారు. తూర్పు నుంచి పశ్చిమానికి రాహుల్​ చేపట్టిన న్యాయ యాత్ర 15 రాష్ట్రాల గుండా సాగుతుంది. ఈ యాత్ర మార్చి 20న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ముగియనుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద యాత్రగా పేర్కొనవచ్చు. రాహుల్​గాంధీ సెప్టెంబర్ 7, 2022 నుంచి జనవరి 30, 2023 వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4,000- కిలోమీటర్ల మేరకు భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా ముగించారు. దీనికి కొనసాగింపుగా భారత్ జోడో న్యాయ్ యాత్రను ఆయన చేపట్టారు. రెండు యాత్రల మధ్య ఉన్న ఒకే ఒక్క వ్యత్యాసం ఏమిటంటే భారత్ జోడో యాత్ర మొత్తం పాదయాత్రగా కొనసాగింది. అయితే భారత్ జోడో న్యాయ్ యాత్ర అనేది ప్రాథమికంగా బస్ యాత్ర, కానీ, ఇందులో 8-9 కి.మీ పాదయాత్ర, సివిల్ సొసైటీ నాయకులతో రాహుల్​గాంధీ ఇంటరాక్షన్,  కనీసం రెండు ర్యాలీలలో ప్రసంగించడం వంటి విభిన్న అంశాలు ఉన్నాయి. ఈ యాత్ర తనకోసం కాదని ప్రజల మన్ కీ బాత్​ తెలుసుకోవడానికి అని రాహుల్​ గాంధీ ప్రకటించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవటానికి, వారి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి యాత్ర చేస్తున్నట్లు రాహుల్​ తెలిపారు. తను మాట్లాడటం కంటే ప్రజలు చెప్పినది ఎక్కువగా వినడం, ప్రజల గురించి మరింత అర్థం చేసుకోవడం యాత్ర  ముఖ్య ఉద్దేశ్యంగా రాహుల్​వెల్లడించారు. 

1930లో గాంధీ దండి యాత్ర

అహ్మదాబాద్‌‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి గుజరాత్‌‌లోని దండి తీర గ్రామం వరకు, 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు మహాత్మాగాంధీ 390 కిలోమీటర్ల సుదీర్ఘ  దండి యాత్ర చేపట్టారు. దండి వద్ద సముద్రం ఒడ్డున గాంధీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించి ప్రజల్లో స్వాతంత్ర్యం ఆశలు రేకెత్తించారు. అనంతరం భారత్ జోడో న్యాయ్ తప్ప మరే ఇతర యాత్ర కూడా ప్రజల్లో  ఆశలు, అంచనాలను రేకెత్తించలేదు. సామాజిక అన్యాయం, ఆర్థిక అన్యాయం, రాజకీయ అన్యాయం వంటి సర్వత్రా దృష్ట్యా ఈ యాత్ర సామాన్య ప్రజలలో ఉత్కంఠను రేకెత్తించినట్లు కనిపిస్తోంది. న్యాయ్ యాత్ర ప్రారంభమైన సందర్భంగా, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య న్యూఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కూడా అయిన జస్టిస్ ఈశ్వరయ్య.. తెలంగాణలోని అన్ని బీసీ సంస్థల మద్దతును రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాథమికంగా జస్టిస్ వి ఈశ్వరయ్య కుల గణనకు వెళ్లాలన్న రాహుల్ గాంధీ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. సమాజంలోని వెనుకబడిన, అణగారిన, బడుగు, బలహీన వర్గాల చేతుల్లోకి అధికారాన్ని బదిలీ చేయడానికి ఇదే ఏకైక మార్గంగా భావించారు.  

మైనార్టీలకు పీవీ సర్కారు రిజర్వేషన్లు

మైనార్టీలకు పి వి నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం  4.5 శాతం రిజర్వేషన్ల సబ్​ కోటాను రూపొందించింది. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం, 1992 సెక్షన్ 2 (సి) ప్రకారం ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లు (పార్సీలు) , భారత ప్రభుత్వ పరిధిలోని  సివిల్ పోస్టులు, సర్వీసెస్​, కేంద్ర విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్​ కల్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే హైకోర్టులోని 7 మంది న్యాయమూర్తుల బెంచ్ దానిని కొట్టివేసింది. రాష్ట్రంలోని మొత్తం ముస్లిం సమాజాన్ని వెనుకబడిన తరగతిగా గుర్తించడం అశాస్త్రీయంగా ఉందని బెంచ్​ పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్​ఎల్పీ)పై సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు, అపెక్స్ కోర్టు రిజర్వేషన్లను సమర్థించింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ..ముస్లిం సమాజంలోని కొన్ని వర్గాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని ప్రభుత్వం అభిప్రాయపడింది. ముస్లింలలో అత్యంత వెనుకబడిన వర్గాల గుర్తింపు రాష్ట్ర వెనుకబడిన వర్గాల కమిషన్​ వారిచే నిర్వహించబడుతుందనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైనందున, తీర్పును జారీ చేసేటప్పుడు హైకోర్టు సరిగ్గా అన్వయించలేదని అప్పటి అటార్నీ జనరల్ జీఈ వాహనవతి సుప్రీంకోర్టులో వాదించారు. 

జనాభా గణన పట్టని మోదీ

 జనాభా గణన చివరిసారిగా 2011లో జరిగింది. కానీ, డేటా ప్రక్రియ పూర్తయ్యే సమయానికి, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పదవీ కాలం ముగిసింది. అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఈ డేటాను బహిరంగపరచడానికి నిరాకరించింది. మరో విషయం ఏమిటంటే కొవిడ్​ మహమ్మారి విజృంభించడంతో దాన్ని సాకుగా చూపుతూ 2021లో జనాభా గణనను నిర్వహించలేదు. ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం జనాభా గణనను ఆదేశించేందుకు మొగ్గు చూపడంలేదు. ఈ నేపథ్యంలోనే కుల గణన కోసం రాహుల్ గాంధీ గళమెత్తడంతో విస్తృతంగా మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న గణాంకాలు 2001 జనాభా లెక్కల నుంచి అందినవి. అయితే ఈ డేటా రెండు దశాబ్దాల కంటే పాతది. 2011 కుల గణన డేటా పబ్లిక్ చేయడం లేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తాజాగా కుల గణనకు ఆదేశిస్తానని రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం వెనుకబడిన వర్గాల్లో ఆశలు రేకెత్తిస్తోంది. 

కాంగ్రెస్​పై బీసీల నమ్మకం

అధికారాలను నియంత్రించే 90 మంది సెక్రటరీ స్థాయి అధికారుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలకు చెందినవారు ఉన్నారు. కొద్దిమంది మాత్రమే బడ్జెట్ కేటాయింపుల్లో కేవలం 5 శాతాన్ని ఎలా నియంత్రిస్తున్నారో రాహుల్ గాంధీ స్వయంగా తెలిపారు. జనాభాలో బీసీలు 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ, ప్రభుత్వంలో, పాలనా ప్రక్రియలలో వారి వాస్తవ భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. ఇది తీవ్రమైన రాజకీయ అన్యాయం, దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశాన్నిభారత్ జోడో న్యాయ్ యాత్ర కల్పిస్తుంది. రాహుల్ గాంధీని కలిసిన సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ..కుల గణన లేకుండానే బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందని అన్నారు. కానీ, బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రం  మోదీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఇది కూడా తీవ్రమైన అన్యాయమన్నారు. బీసీలకు రిజర్వేషన్ల ప్రయోజనాలు అందడం లేదని జస్టిస్ ఈశ్వరయ్య ప్రధానంగా తెలిపారు. తాజా గణాంకాలను బట్టి రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇది ప్రధాన సమస్య.  తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాంటి జాప్యం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్​ సర్కారు కుల గణన చేపట్టాలని జస్టిస్ ఈశ్వరయ్య రాహుల్ గాంధీని కోరారు. ఇది పూర్తయితే బీసీలకు కాంగ్రెస్​పై మాత్రమే నమ్మకం ఉందన్న సందేశం దేశమంతటా వెళుతుందన్నారు. రానున్న లోక్‌‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని బీసీ ఫెడరేషన్‌‌తోపాటు ఇతర సంస్థలు నిర్ణయించాయని కాంగ్రెస్‌‌ నేత మధుయాష్కీ గౌడ్‌‌ తెలిపారు.

కులగణన కోసం గళమెత్తిన రాహుల్  

ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఏదైనా రిజర్వేషన్​ కేటాయించేటప్పుడు తప్పనిసరిగా ముందుగా వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను నిర్ణయించే ఒక అధ్యయనం చేయాలి. అధ్యయన నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపు జరుగుతుంది. జాతీయ స్థాయిలో 1955లో అటువంటి అధ్యయనం జరిగింది. జవహర్‌‌లాల్ నెహ్రూ ప్రభుత్వ హయాంలో సమర్పించిన కాలేల్కర్ కమిషన్ నివేదిక, 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో సమర్పించిన మండల్ కమిషన్ నివేదిక రూపంలో ఇటువంటి అధ్యయనం ఇప్పటికే మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు  ఇక అవసరమైనది కచ్చితమైన జనాభా గణాంకాల రూపంలోని బీసీల డేటా. అప్పుడే వెనుకబడిన తరగతులకు పాలనా ప్రక్రియల్లో దామాషా ప్రాతినిధ్యాన్ని కల్పించవచ్చు.

-  పర్సా వెంకట్,పొలిటికల్​ ఎనలిస్ట్​