హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై ప్రకటనల్లో గోల్ మాల్ జరిగింది. భారీ ఎత్తున నిధులు చేతులు మారాయని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. సిటీలోని 11వేల మెట్రో పిల్లర్లు రెండు సంస్థల గుప్పిట్లో ఉన్నాయని కార్పొరేటర్లు ఆరోపించారు. ఇవాళ జరిగిన జీహెచ్ఎంసీ పాలకవర్గం సమావేశంలో దీనిపై చర్చకు పట్టుబట్టారు. కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో పిల్లర్ల నిధులను ఆ సంస్థనే తీసుకుంటోందని, దానికి జీహెచ్ఎంసీ ఎందుకని ప్రశ్నించారు. మెట్రో నుంచి ఎలాంటి నిధులూ జీహెచ్ఎంసీకి రావడం లేదన్నారు. నగరంలో 2వేల పిల్లర్లున్నాయని ఒక్కో పిల్లర్ కు రూ. 11 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
వాటిని కూడా ఓ రెండు ప్రైవేటు సంస్థలు మెయిన్ టెయిన్ చేస్తున్నాయన్నారు. నెలకు మెట్రోకు రూ. 35 వేలు కట్టి 9 లక్షల రూపాయలను ఆ సంస్థలు వసూలు చేస్తున్నాయన్నారు. సమాచార పౌరసంబంధాలశాఖ ప్రకటనలకు సైతం సదరు సంస్థలు ఒక్కో పిల్లర్ రూ. 50 వేల చొప్పున వసూలు చేస్తున్నాయని, మెట్రోలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలున్నా.. ఆ సంస్థ ఎండీ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో సంస్త ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి వాటాలున్నాయని ఆరోపించారు.
ఇదే అంశంపై కాంగ్రెస్ కార్పొరేటర్లు ఫైర్ అయ్యారు. ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చి బీఆర్ఎస్ కమీషన్లు తీసుకుంటోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఖండించారు. దీంతో కాసేపు రసాభాస చోటు చేసుకుంది. దీనిపై కార్పొరేటర్లు మాట్లాడుతూ.. అధికార పక్షంలోని మంత్రులు కాంట్రాక్టులు చేయడం లేదా..? అంటూ ఎదురుదాడికి దిగారు. వాళ్లంతా కాంగ్రెస్ నేతలకు కమీషన్లు ఇస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. దీంతో కాసేపు సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది.
విచారణకు ప్రత్యేక అధికారి
జీహెచ్ఎంసీలో ప్రకటనలపై విచారణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్ ను ఆదేశించారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామనటంతో గొడవ సద్దుమణిగింది.