- నిరుటి కన్నా 9 శాతం ఎక్కువ
- మొత్తం కేటాయింపుల్లో రెవెన్యూ వ్యయం రూ.4.88 లక్షల కోట్లు
- మూలధన వ్యయం రూ.1.92 లక్షల కోట్లు
- బలగాల ఆధునీకరణపై ప్రధానంగా ఫోకస్
న్యూఢిల్లీ: మన దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. 2025–26 కేంద్ర బడ్జెట్లో డిఫెన్స్‌కు బిగ్ బూస్ట్ కలిగింది. ఈ బడ్జెట్లో రక్షణ రంగానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.6.81 లక్షల కోట్లు కేటాయించారు.
నిరుటి బడ్జెట్ (రూ.6.20 లక్షల కోట్లు)లో కేటాయించిన దాని కన్నా 9.55% ఎక్కువగా కేటాయింపులు చేశారు. రూ.6.81 లక్షల కోట్లలో రెవెన్యూ వ్యయం రూ.4.88 లక్షల కోట్లు (గత బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ.2.83 లక్షల కోట్లు) కాగా.. మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) రూ.1.92 లక్షల కోట్లు.
రెవెన్యూ వ్యయంలో సాయుధ బలగాల సిబ్బంది జీతాలు, ఆపరేషనల్ వ్యయాలు, మెయింటెనెన్స్ ఉండగా.. మూలధన వ్యయంలో కొత్త ఎక్విప్మెంట్లు, మిలిటరీ హార్డ్‌వేర్ కొనుగోలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునీకరణ వంటివి ఉంటాయి.
మూలధన వ్యయంలో రూ.48,614 కోట్లను ఎయిర్ క్రాఫ్ట్, ఎయిరో ఇంజిన్ల కోసం కేటాయించగా.. రూ.24,390 కోట్లను యుద్ధ నౌకల (నావల్ ఫ్లీట్) కోసం అలకేట్ చేశారు. ఇతర ఎక్విప్మెంట్ల కోసం రూ.63,099 కోట్లను వినియోగిస్తారు. కాగా.. 2024–25 బడ్జెట్ లో రూ.6,21,940 కోట్లు కేటాయించగా..దానిలో క్యాపిటల్ ఔట్ లే (మూలధన వ్యయం) రూ.1,72,000 కోట్లు.
ఇక, తాజా బడ్జెట్లో బలగాల ఆధునీకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈస్టర్న్ లద్దాఖ్‌లో చైనాతో గొడవలు, పాకిస్తాన్‌తో క్రాస్ బార్డర్ టెర్రరిజం నేపథ్యంలో సాయుధ బలగాలను మరింత శక్తివంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది.
అందుకు అనుగుణంగా బడ్జెట్ లో భారీగా కేటాయింపులు చేసింది. అత్యాధునిక ఎక్విప్ మెంట్లతో బలగాలను మరింత బలోపేతం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు రూ.1.92 లక్షల కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఆత్మనిర్భర్ భారత్ కింద దేశీయంగా ఆయుధాలు, యుద్ధ సామగ్రిని తయారు చేస్తారు.
యుద్ధ విమానాలు (ఫైటర్ జెట్స్), సబ్ మెరైన్లు, డ్రోన్లు వంటివి తయారు చేయడంతో పాటు అత్యాధునిక ఆయుధాలు, సామగ్రి కొనుగోలు చేస్తారు. అలాగే, మౌలిక సదుపాయాలను మరింత పెంచనున్నారు.
మూలధన వ్యయంలో రూ.1,11,544 లక్షల కోట్ల (75 శాతం)తో ప్రొక్యూర్ మెంట్లను దేశీయంగానే చేస్తారు. దానిలో రూ.27,886 కోట్లను (25 శాతం) దేశీయ ప్రైవేటు పరిశ్రమల ద్వారా ప్రొక్యూర్మెంట్లు చేస్తారు. ఇక, నావల్ డాక్ యార్డ్ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా రూ.4,500 కోట్లు కేటాయించారు.
క్యాపిటల్ వ్యయంలోనే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) కు రూ.7,146 కోట్లు అలకేట్ చేశారు. ఈ నిధులతో కొండ ప్రాంతాల్లో సాయుధ బలగాల సిబ్బంది సులభంగా విధులు నిర్వహించేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారు. రెవెన్యూ వ్యయంలో డిఫెన్స్ సిబ్బంది (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) జీతభత్యాల కోసం రూ.,197,317 కోట్లు కేటాయించారు.
డీఆర్డీఓకు రూ.26,816 కోట్లు
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) కు ఈసారి కేటాయింపులు పెరిగాయి. నిరుడు రూ.23,855 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.26,816 కో ట్లు కేటాయించారు. ఈ నిధుల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు కోసం రూ.14,923 కోట్లు అలాట్ చేశారు.
కేటాయింపులు బాగున్నాయ్: రాజ్ నాథ్
డిఫెన్స్‌కు కేటాయింపులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. కేటాయింపులు బాగున్నాయని, వాటిని స్వాగతిస్తున్నామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసుకునే దిశగా తమ పయనం సాగుతున్నదన్నారు.
తాజా కేటాయింపుతో డిఫెన్స్‌కు బూస్ట్ దొరికినట్లయిందన్నారు. మూలధన వ్యయంతో అత్యాధునిక పరికరాలు, ఆయుధాలు కొనుగోలు చేస్తామని చెప్పారు. తాజా బడ్జెట్ తో దేశ భద్రత మరింత బలోపేతం అవుతుందని, వికసిత్ భారత్ లో మరో అడుగు ముందుకు పడిందన్నారు.
సివిల్ ఆపరేషన్లకు రూ.28 వేల కోట్లు
తాజా బడ్జెట్లో డిఫెన్స్ శాఖలోని సివిల్ ఆపరేషన్లకు రూ.28,682 కోట్లు కేటాయించారు. డిఫెన్స్‌ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ కేటాయింపులు చేశారు. పాలసీ ప్లానింగ్, రీసెర్చ్ బలగాల సమర్థతను పెంచే సపోర్ట్ సిస్టమ్స్ కోసం ఈ నిధులను వినియోగిస్తారు. నిరుడు బడ్జెట్లో రూ.25,693 కోట్లు కేటాయించారు.
డిఫెన్స్ పెన్షన్లకు నిధుల పెంపు
తాజా బడ్జెట్లో డిఫెన్స్ పెన్షన్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. నిరుటి బడ్జెట్లో ఇవి రూ.1.41 లక్షల కోట్లు ఉండగా.. ఈసారి రూ.1.60 లక్షల కోట్లకు పెంచింది. అంటే డిఫెన్స్ పెన్షన్లకు ఈసారి 13.5 శాతం కేటాయింపులు పెరిగాయి.
రిటైరయిన డిఫెన్స్ సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పెన్షన్లు పెంచారు. డిఫెన్స్ సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.