చెరకు సాగుకు భరోసా ఇస్తేనే ముందడుగు

చెరకు సాగుకు భరోసా ఇస్తేనే ముందడుగు
  • నిజాం షుగర్స్ రీఓపెనింగ్​పై రైతుల అభిప్రాయానికి మీటింగ్​
  • ఐదు మండలాల రైతులు హాజరయ్యేలా​ఏర్పాట్లు
  • చెరకు సాగు పెంచేందుకు సర్కార్ యత్నం

నిజామాబాద్, వెలుగు: నిజాం షుగర్​ఫ్యాక్టరీలను రీఓపెన్​ చేయడానికి ప్రభుత్వం​ చర్యలు చేపట్టింది. చెరకు సాగుకు రైతులను మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తోంది.  చెరుకు పండించడానికి సర్కారు నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఆశిస్తున్నారో  తెలుసుకోడానికి మీటింగ్​ ఏర్పాటు చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సరయూ ఫంక్షన్​ హాల్​లో 28న నిర్వహించనున్న సమావేశంలో రైతులు వెలిబుచ్చే అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్​కు ఎన్ఎస్​ఎఫ్​ పరిధిలోని ఐదు మండలాల రైతులు హాజరుకాన్నారు.

కనీసం 5 లక్షల టన్నుల చెరకు అవసరం

బోధన్​లోని చక్కెర మిల్లు రోజు వారీ చెరకు క్రషింగ్​ కెపాసిటీ 3,500 టన్నులు.  ఒక సీజన్​ లాభదాయకంగా నడవాలంటే కనీసం 5 లక్షల టన్నులు అవసరం. ఇప్పుడున్న వంగడాల ప్రకారం ఎకరం చెరకు పండిస్తే గరిష్టంగా 40 టన్నుల దిగుబడి వస్తుంది. ఆ లెక్కన కనీసం 13 వేల ఎకరాలలో చెరకు సాగు చేస్తేనే ఫ్యాక్టరీకి ముడిసరుకు అందుతుంది. కర్మాగారం నడిచినప్పుడే డిమాండ్​కు సరిపడా చెరుకు అందక గతంలోకేవలం 60 వేల టన్నులతో  సీజన్ ముగిసింది.  మిల్లు మూతపడ్డాక అంతకు ముందు చెరకు సాగు చేసిన 95 శాతం రైతులు ఇతర పంటలకు వైపు మళ్లారు.

మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న బోనస్​ దృష్ట్యా జిల్లాలో వ్యవసాయం అంటేనే వరి సాగు అన్నట్లుగా మారింది. జిల్లాలో 5.30 లక్షల ఎకరాల అగ్రికల్చర్​ ల్యాండ్​ ఉండగా అందులో 4.20 లక్షల ఎకరాల్లో వరి పంటే వేస్తున్నారు. ఏడాదిలో రెండుసార్లు వరి పంట సాగుచేసే వీలుండగా చెరకు ఒకే పంట వస్తుంది. ఈ టైంలో రైతులను తిరిగి చెరకు వైపు తీసుకురావడం పెద్ద టాస్కే. 

ముడిసరుకు భరోసా అత్యంత కీలకం

1938లో నిజాం నవాబు బోధన్​లో నిర్మించిన నిజాం షుగర్​ ఫ్యాక్టరీ తరువాతి కాలంలో భారీ లాభాలు ఆర్జించింది. క్రమంగా రాష్ట్రంలో ఎనిమిది షుగర్​ మిల్స్, రెండు అల్కాహాల్​ఫ్యాక్టరీలు, ఒక మెషినరీ డివిజన్, సోడా గ్యాస్​ ప్లాంట్​ తదితర అనుబంధ పరిశ్రమలతో ఎదిగింది. ఆ తర్వాత పాలకుల నిర్ణయాలతో 2002 నాటికి బోధన్​, మెదక్​, మెట్​పల్లి మూడు  ఫ్యాక్టరీలు ప్రైవేట్​పరమయ్యాయి. మిగితా వాటిని అంతకుముందే అమ్మేశారు. ప్రైవేట్​ మేనేజ్​మెంట్​ మూడు ఫ్యాక్టరీలకు 2015లో లేఆఫ్​ప్రకటించి క్లోజ్​ చేశారు. 

 అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో ఫ్యాక్టరీలను తిరిగి ప్రభుత్వపరం చేసుకుంటామని హామీ ఇచ్చిన బీఆర్​ఎస్​ సర్కారు తన పదేండ్ల పాలనలో పునరుద్ధరణ గురించి పట్టించుకోలేదు.  వీటి రీఓపెనింగ్​కు హామీ ఇచ్చిన సీఎం రేవంత్​రెడ్డి ప్రభుత్వం ఫ్యాక్టరీ బకాయిలు రూ.190 కోట్లను వన్​టైం సెటిల్​మెంట్​ కింద బ్యాంకులకు మూడు నెలల కింద కట్టేసింది. మంత్రి శ్రీధర్​బాబు నేతృత్వంలోని సబ్​ కమిటీ అభిప్రాయాలు కూడా సేకరించి ఫ్యాక్టరీలు రీఓపెన్​ చేసే కసరత్తు మొదలు పెట్టింది. 

కర్మాగారాలు ఓపెన్​  చేసేనాటికి చెరకు అందుబాటులో ఉంటేనే అంతా సాఫీగా సాగుతుంది. ఎన్ఎస్ఎఫ్​ నడిచిన కాలంలో తకావీ లోన్​ పేరుతో చెరకు సాగు చేసే రైతులకు పంట పెట్టుబడి ఖర్చుగా బ్యాంకులు లోన్లు  ఇచ్చేవి. సీడ్​తో పాటు ఎరువులను మేనేజ్​మెంట్​ సరఫరా చేసేది.  ఇప్పుడు చెరుకు చేయడానికి రెడీ అయ్యే రైతులు ఏమి కోరనున్నారో తెలుసుకోడానికి మీటింగ్​పెడుతున్నారు. వారిని సిద్ధం చేయడం అన్నింటికంటే ముఖ్యమని భావిస్తున్నారు. ఉమ్మడి బోధన్, కోటగిరి, వర్ని, రెంజల్​, ఎడపల్లి రైతులను మీటింగ్​కు ఆహ్వానించారు.

అధిక దిగుబడి, మెషినరీపై ఆధారం

వరి పంటకు మళ్లిన రైతులంతా వరి నాట్లకు గుజరాత్, బెంగాల్ కూలీలతో వేయిస్తున్నారు. లోకల్​ కూలీలను నమ్మి చెరుకు సాగు చేయడం కష్టం. మోడ్రన్​ మెషిన్​ల వాడకం ఉంటేనే మళ్లీ చెరుకు వైపు ఫార్మర్స్​ డైవర్ట్​ అవుతారు. ఎకరానికి వంద టన్నుల దిగుబడి వచ్చే సీడ్​ప్రభుత్వం సరఫరా చేయాలి. – కె.పి. శ్రీనివాసరెడ్డి, ప్రెసిడెంట్, జిల్లా ఉత్పత్తిదారుల సంఘం