సర్పంచిగిరి కోసం భూమిజాగలు అమ్ముతున్రు

  • త్వరలోనే ఎన్నికలకు నోటిఫికేషన్‍
  • అప్పు చేయడానికి, ఆస్తులు అమ్మడానికి  పోటీదారులు సిద్ధం 
  • ఊళ్లో మంచిపేరున్నా.. అడ్డువస్తున్న ఆర్థిక బలాలు
  • డబ్బుల కోసం  పడరాని పాట్లు రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి

వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్‍, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ముగియడంతో ప్రభుత్వం త్వరలోనే సర్పంచ్‍ ఎలక్షన్లకు నోటిఫికేషన్‍ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అందరి కండ్లు పల్లె రాజకీయాలపై పడ్డాయి. ఇన్నాళ్లూ ఆయా పార్టీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థుల కోసం కష్టపడ్డ గ్రామ లీడర్లు సర్పంచ్​గా గెలవాలని ఆరాటపడుతున్నారు.

2018 పంచాయతీరాజ్‍ చట్టం ప్రకారం పదేండ్లకోసారి రిజర్వేషన్లు మార్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్‍ సర్పంచులతో పాటు కొత్త లీడర్లు కూడా సర్పంచ్​ పదవి కోసం రెడీ అవుతున్నారు. ఎన్నికల్లో పైసలతోనే పని ఉండడంతో పోటీదారులు డబ్బుల కోసం పడరానిపాట్లు పడుతున్నారు. ఆస్తులను అమ్మడానికో..లేకపోతే తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకునేందుకో ప్రయత్నాలు చేస్తున్నారు.

కొత్తోళ్లతో పాటు బిల్లుల కోసం పాతోళ్లు రెడీ 

ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెల మొదట్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‍ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా, పదేండ్లు బీఆర్‍ఎస్‍ హవా నడవడంతో ఇతర పార్టీల నుంచి సర్పంచ్​గా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఇప్పుడు కాంగ్రెస్‍ అధికారంలోకి ఉండడంతో పల్లె రాజకీయాల సీన్​ మారింది. గ్రామాల్లోని కొత్త లీడర్లు ఈసారి సర్పంచులుగా  పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

దీనికితోడు సిట్టింగ్‍ సర్పంచులు కూడా ఇష్టం లేకున్నా మరోసారి బరిలోకి దిగేందుకు ప్లాన్‍ చేసుకుంటున్నారు. కేసీఆర్‍ ప్రభుత్వంలో స్థానిక సంస్థల బిల్లులు మంజూరు చేయలేదు. దీంతో వేల మంది సర్పంచులు రూ.లక్షలు వడ్డీలకు తెచ్చి వైకుంఠధామాలు, రైతు వేదికలు, రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. బిల్లుల కోసం ధర్నాలు చేశారు. పలుచోట్ల అప్పుల బాధతో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అయినా, వాటి బిల్లులు రాకముందే పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి పెండింగ్​ బిల్లులను రాబట్టుకునేందుకు సిట్టింగులు సమాయత్తం అవుతున్నారు.

భూముల అమ్మకం..తాకట్టు 

గ్రామస్థాయిలో ఉండే లీడర్లలో ఎక్కువగా రైతు కుటుంబాల నేపథ్యం ఉన్నవారే ఎక్కువ. దీంతో వీరు సర్పంచ్‍ ఎలక్షన్లలో డబ్బుల కోసం తమ భూములను అమ్మకానికి పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఒకటి రెండుచోట్లని కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ గ్రామాల్లో పంట భూములు లేదంటే ప్లాట్లు అమ్మే ఆలోచనలో ఉన్నారు. చేతిలో ఎంతో కొంత డబ్బులున్న మరికొందరు తాతల నుంచి వచ్చిన భూములను తాకట్టుపెట్టి అప్పుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.  

రూ.20 లక్షల నుంచి రూ.కోటి కావాలంటా...

ఎంపీ ఎలక్షన్ల నుంచి మొదలుకుంటే సర్పంచ్‍ ఎలక్షన్ల వరకు డబ్బు లేనిదే పని కావడం లేదు. దీంతో 600 నుంచి 1000 ఓట్లు ఉండే చిన్నపాటి గ్రామాల్లో సర్పంచ్​గా పోటీ చేయాలంటే రూ.20 నుంచి 25 లక్షలు..5 నుంచి 7 వేల ఓట్లుండేచోట రూ.50 లక్షలు, 8 వేలకు పైగా ఓట్లుండే పెద్ద గ్రామ పంచాయతీల్లో రూ.కోటి వరకు ఖర్చు తప్పదని గతంలో పోటీ చేసిన సర్పంచ్​లు చెబుతున్నారు. సర్పంచ్ ​పదవి కావాలంటే ఈ మాత్రం ఖర్చు పెట్టక తప్పదంటున్నారు. ఈ డబ్బులు ఎక్కడ తీసుకురావాలా అని ఆలోచిస్తున్నారు.  

పాత బిల్లుల కోసం..మళ్లీ సర్పంచ్‍ బరిలో ఉంటా..

మొన్నటివరకు సర్పంచ్‍గా పనిచేసిన. అప్పు తీసుకువచ్చి గ్రామంలో రోడ్లు వేసిన. వైకుంఠధామాలు కట్టిన. కేసీఆర్‍ ప్రభుత్వం పనుల కోసం నిధులు ఇవ్వకుండా జిల్లా అధికారులను మా మీదకు వదిలింది. వారేమో పనులకు డెడ్‍లైన్లు పెట్టి నోటీసులంటూ వేధించారు. మరోపక్క ఎలక్షన్ల టైంలో జనాలకు పనుల విషయంలో హామీలు ఇవ్వడంతో అక్కడిక్కడ అప్పులు తెచ్చి పనులు చేసిన. నాకు రూ.15–20 లక్షల పెండింగ్‍ బిల్లులు రావాలె. మళ్లీ సర్పంచ్‍ అయితేనే ఎట్లనో వాటిని తెచ్చుకోవచ్చనే ఆశ ఉంది. అందుకే సర్పంచ్‍ పదవి ఇష్టం లేకున్నా..మరోసారి అప్పుచేసి మరీ పోటీ చేయాలని చూస్తున్నా.  
- వరంగల్‍ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని ఓ సర్పంచ్‍..

వరంగల్‍ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఓ లీడర్‍.. తనను గెలిపిస్తే ఊరి అభివృద్ధి కోసం రూ.50 లక్షలు వ్యక్తిగతంగా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు బహిరంగంగా ప్రచారం చేస్తున్నాడు. నమ్మకం కోసం.. గ్రామంలో గుంట భూమి ధర రూ.5 లక్షలు ఉండగా.. తనకు సంబంధించిన 10 గుంటలు రాసిచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఖర్చుల కోసం మరో రూ.10 లక్షలు అవసరం పడగా మరికొంత భూమిని అమ్మే పనిలో ఉన్నాడు. 

హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ చిన్న గ్రామం అది. ఈసారి ఏదేమైనా సర్పంచ్‍ అవడమే లక్ష్యంగా ఓ రాజకీయ పార్టీలో యాక్టివ్​గా ఉండే గ్రామవాసి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. 1000కి అటుఇటుగా ఓట్లు ఉన్న ఈ గ్రామంలో..పోటీ చేయాలంటే రూ.20–25 లక్షలు అవసరమని భావించాడు. డబ్బులు లేకపోవడంతో తనకున్న మూడు, నాలుగు ఎకరాల భూమిలో కొంత భాగాన్ని అమ్ముతానని గ్రామంలోని పెద్ద మనుషులు, రియల్‍ వ్యాపారులకు చెప్పిపెట్టాడు.