- గత ప్రభుత్వ హాయంలో రాజీవ్ స్వగృహ ఇండ్ల, ప్లాట్ల అమ్మకాలు
- మిగిలిన వాటి అమ్మకాలనికి మరో సారి ప్రభుత్వం చర్యలు
కామారెడ్డి, వెలుగు : రాజీవ్ స్వగృహ కింద ఇండ్లు, ప్లాట్ల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ వెంచర్లో మరిన్నిప్లాట్లను వేలం వేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కానీ, ఈ వెంచర్లో మౌలిక వసతుల కోసం నిధులు ఇవ్వడానికి మాత్రం అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు.
రూ.13 కోట్లలో ప్రతిపాధలు పంపితే కేవలం రూ. 78 లక్షలు ఇచ్చారు. మధ్య తరగతి వర్గాలతో పాటు, ఎంప్లాయీస్‌కు సొంతింటి కల నెరవేర్చే ఉద్ధేశంతో 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హౌజింగ్ కార్పొరేషన్ ద్వారా రాజీవ్ స్వగృహ ఇండ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. రాష్ర్ట వ్యాప్తంగా జిల్లా కేంద్రాలతో పాటు, డివిజన్ కేంద్రాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా కామారెడ్డిలో హైవే పక్కన అడ్లూర్ శివారులో 20 ఎకరాల్లో రాజీవ్ స్వగృహ ఇండ్ల నిర్మాణం షూరు చేశారు.
ఇండ్లు కావాలనుకున్న వారి నుంచి అప్లికేషన్లతో పాటు కొంత అమౌంట్ తీసుకున్నారు. రాష్ర్ట విభజన , ఇతరత్రా కారణాలతో ఇండ్ల నిర్మాణం మధ్యలోనే అగిపోయి, ఏండ్ల తరబడి పనులు అలాగే ఉండిపోయాయి. ఆదాయ అన్వేషణలో భాగంగా రాజీవ్ స్వగృహ ఇండ్లు, ప్లాట్లను అమ్మాలని గత బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. మూడేండ్ల క్రితం నుంచి ఇండ్లు, ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. 3 విడతల్లో వేలాలు జరిగాయి. అమ్మకాలు జరిగి ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరేందుకు అప్పట్లో ఆఫీసర్లకు టార్గెట్ పెట్టారు. దీంతో కలెక్టర్లు, ఇతర ఆఫీసర్లు స్వయంగా విస్తృత ప్రచారం కల్పించారు.
భారీగానే ఆదాయం
కామారెడ్డిలో మొత్తం 543 ప్లాట్లు చేశారు. ఇందులో 138 ఇండ్ల నిర్మాణం షూరు చేయగా ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఫైనల్ స్టేజీలో ఉండగా మరి కొన్ని స్లాబ్ లెవల్, ఇంకొన్ని పిల్లర్స్ దశలో ఉన్నాయి. 405 ( ప్లాట్లు) ఉన్నాయి. గత ప్రభుత్వం 3 విడతల్లో వేలం వేయగా 326 ప్లాట్లు, 31 ఇండ్లు అమ్ముడుపోయాయి. వీటి ద్వారా రూ. 50 కోట్ల వరకు ఆదాయం సమకూరింది.
వసతులు లేక ఇబ్బందులు
అమ్మేందుకు సిద్ధంగా ఉన్నా.. వెంచర్ లో మాత్రం పూర్తి స్థాయి సదుపాయాలు లేవు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతి కల్పించాల్సి ఉంది. ఇక్కడ మౌలిక వసతుల కోసం గతంలోనే రూ. 13 కోట్లతో ప్రతిపాధనలు పంపారు. రోడ్లు, డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంక్‌ల నిర్మాణం, తాగునీటి పైపులైన్, కరెంటు లైన్ వంటి వాటి కోసం ప్రపోజల్ పంపారు. వేలం టైంలోనే తాత్కలికంగా మొరం పోసి రోడ్డు వేశారు. ఏరియాను క్లీన్ చేశారు.
మౌలిక వసతులు కల్పించాలని వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తులు కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతి పత్రం కూడా అందించారు. వసతులు కల్పిస్తే కొనుగోలు చేసిన ఇండ్లలో తాము నివాసం ఉంటామని పేర్కొంటున్నారు. మిగిలిపోయిన ఉన్న ఇండ్లు, ప్లాట్లను అమ్మేందుకు ప్రభుత్వం మళ్లీ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే జిల్లాల వారీగా వివరాలు సేకరించారు. కామారెడ్డిలో వివిద దశల్లో ఉన్న ఇండ్లు 107, ప్లాట్లు 79 ఉన్నాయి.