మరో 10 మంది మిల్లర్లపై ఆర్ఆర్​ యాక్ట్ .. కోర్టుకు వెళ్లిన ఐదుగురు మిల్లర్లు

మరో 10 మంది మిల్లర్లపై ఆర్ఆర్​ యాక్ట్ .. కోర్టుకు వెళ్లిన ఐదుగురు మిల్లర్లు
  • బకాయిలు కట్టేంత వరకు ఆస్తులు అమ్మవద్దని మిల్లర్లకు హైకోర్టు​ ఆదేశం
  • లీజ్​దారు, ఓనర్​ ఇద్దరు బాధ్యులేనని స్పష్టీకరణ
  • చర్యలపై స్టేట్​ రికవరీ కమిటీదే తుది నిర్ణయం

నాగర్ కర్నూల్, వెలుగు: ​ వరిధాన్యాన్ని మిల్లింగ్​ చేసి సీఎంఆర్​ అందించాల్సిన  రైస్​ మిల్లర్ల బకాయిలు పెరగడంతో ప్రభుత్వం నోటీసులు ఇచ్చి క్రిమినల్​ కేసులు పెడుతోంది. బకాయిలు రూ. కోట్లల్లో  పైగా పేరుకుపోవడంతో మిల్లర్లపై సివిల్​ సప్లై అధికారులు ఆర్​ఆర్​ యాక్ట్​ కింద కేసులు నమోదు చేస్తున్నారు.  సీఎంఆర్​ బకాయిపడిన మిల్లర్లపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది. దీంతో రైస్  మిల్లర్లు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. తమపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ న్యాయస్థానాన్ని  వేడుకుంటున్నారు. మిల్లర్ల పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తూనే  మిల్లర్లు తమ ఆస్తులు అమ్ముకోరాదని  ఆదేశాలిచ్చింది. సీఎంఆర్​ బకాయిల రికవరీ కోసం ప్రభుత్వం ఏర్పాటు  చేసిన స్టేట్​ లెవల్​ కమిటీదే తుది నిర్ణయమని పేర్కొంది.

  •  నాగర్​ కర్నూల్​ జిల్లాలో ఇంకా  రూ.40 కోట్ల విలువ చేసే1700 మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. ఇందులో చిన్న మిల్లర్ల కంటే పారా బాయిల్డ్​ రైస్​ మిల్లులే ఎక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో మిల్లర్లు, రెవెన్యూ, సివిల్​ సప్లై, విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ వింగ్​ అధికారులు ఒక్కటై ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.  గత డిసెంబర్​లో జిల్లాలో ఐదు మిల్లులపై ఆర్​ఆర్​యాక్ట్​ కింద కేసులు నమోదయ్యాయి.  ఏప్రిల్​10 లోపు మరో 10 మిల్లులపై ఆర్​ఆర్​ యాక్ట్​ కింద కేసులు నమోదు చేయడానికి సివిల్​సప్లై అధికారులు నోట్​ ఫైల్​ రెడీ చేశారు.  కాగా కేసుల నుంచి తప్పించుకునేందుకు  మిల్లర్లు పొలిటికల్​సపోర్ట్​ కోసం ప్రయత్నిస్తున్నారు.  ప్రభుత్వ ఆదేశాలతో ఎఫ్సీఐ, సివిల్ ​సప్లై శాఖల టీంలు మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేస్తే ప్రభుత్వం ఇచ్చిన వరి ధాన్యం నిల్వల్లో భారీ తేడాలు బయటపడ్డాయి.
  • 2023–-24లో మిల్లర్లకు ఇచ్చిన వరి ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్​ పెట్టాల్సి ఉండగా వాయిదావేస్తూ పోయారు. డిపాల్ట్​ మిల్లర్లకు వరి ధాన్యం ఇవ్వకూడదన్న స్టాడింగ్​ రూల్స్​ను బైపాస్​ చేసిన పాత అధికారులు మిల్లర్ల భాగస్వాముల అవతారమెత్తారు. గోడలు కూడా  పూర్తికాని మిల్లులకు ధాన్యం కేటాయించారు. 
  • డీఎస్​ఓ, సివిల్​సప్లై డీఎం మారిన తర్వాత కొత్తగా చార్జ్​ తీసుకున్న ఇద్దరు అధికారులు సంవత్సరాల వారీగా  మిల్లులకు ఇచ్చిన వరి ధాన్యం, వారు ఎఫ్​సీఐకి పెట్టిన సీఎంఆర్​ వివరాలు, బకాయిలపై రిపోర్ట్​ ఇచ్చారు. మిల్లర్లపై ఒత్తిడి పెరగడంతో 9 నెలల వ్యవధిలో దాదాపు రూ.14 కోట్ల విలువైన బియ్యాన్ని రాబట్టారు.ఇంకా రూ.40 కోట్ల విలువైన సీఎంఆర్​ బియ్యం పెట్టాల్సి ఉంది. బకాయిలు పడిన మిల్లుల్లో వరి ధాన్యం, మిల్లింగ్​ చేసిన బియ్యం రెండు లేకపోవడంతో అధికారులకు దిక్కుతోచడం లేదు.​  

తాజా లిస్ట్​లో కల్వకుర్తి టాప్​...

సివిల్ ​సప్లై అధికారులు తయారు చేసిన సీఎంఆర్​ బకాయిలిస్ట్​లో కల్వకుర్తి టాప్​లో ఉంది. కల్వకుర్తిలో మూడు మిల్లులు, నాగర్​  కర్నూల్​లో రెండు మిల్లులు, అచ్చంపేట, కొల్లాపూర్​లో ఒక్కో మిల్లు ఉంది. ఈ పారాబాయిల్డ్​ మిల్లులకు ఏప్రిల్​ మొదటి వారంలో 6జి కింద నోటీసులు, ఆ వెంటనే ఆర్​ఆర్​ యాక్ట్​ కింద కేసుల నమోదుకు రంగం సిద్దం చేస్తున్నారు. రైస్​ మిల్​ లీజుకు తీసుకుని సీఎంఆర్ బకాయిపడిన వారిని వదిలిపెట్టమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లీజుదారుతో పాటు మిల్లు ఓనర్​ను బాధ్యుడిని చేస్తూ ఇద్దరి ఆస్తులను అటాచ్​ చేసే క్లాజ్​ అగ్రిమెంట్​లోనే ఉందని అంటున్నారు. గ్యారెంటీ ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.